యూరోప్ బ్యాక్ డ్రాప్, వింటేజ్ స్టోరీ, జాతకం యాంగిల్, కళ్లుచెదిరే గ్రాఫిక్స్, భారీ సెట్స్.. ఓ ప్రేమకథకు కావాల్సినవి ఇవి కావు. హీరోహీరోయిన్ల మధ్య అందమైన కెమిస్ట్రీ. హీరోహీరోయిన్లు తెరపై అలా ప్రేమలో లీనమైపోయినప్పుడు ఆ సీన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అక్కర్లేదు. భారీ సెట్ తో పనిలేదు. ఇక ప్రేమకథకు కావాల్సిన మరో ముఖ్యమైన ఎలిమెంట్… సూపర్ హిట్ సాంగ్స్. ఈ రెండు విషయాల్లో ‘రాధేశ్యామ్’ ఫెయిల్ అయింది. ఈ రెండు లేకుండా తీసిన ఈ సినిమా షుగర్ కోటింగ్ పూసి చేదు బిల్లను నోట్లో వేసినట్టే అనిపిస్తుంది తప్ప, దాన్ని చప్పరిస్తూ ఆస్వాదించడానికి పనికిరాదు.
‘రాధేశ్యామ్’ కోసం యూరోప్ సెట్ వేశారు. యూరోప్ లోని కొన్ని దేశాల్లో తీశారు. భారీగా ఖర్చుపెట్టారు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చూపించారు. వీటికోసం నెలల తరబడి కష్టపడినట్టు చెప్పుకొచ్చింది యూనిట్. ఆ కష్టం తెరపైకి కనిపించింది కూడా. కానీ అదే కష్టంలో కొంత భాగాన్ని హీరోహీరోయిన్లతో ఓ వర్క్ షాప్ నిర్వహించడంపై పెడితే చాలా బాగుండేది. అలాంటి హోం వర్క్ ఏదీ జరిగినట్టు రాధేశ్యామ్ లో కనిపించడం లేదు. తెరపై పాన్ ఇండియా స్టార్ కనిపిస్తాడు, సౌతిండియా బుట్టబొమ్మ కనిపిస్తుంది. ఇద్దరూ విడివిడిగా అందంగా ఉన్నారు. కలిసినప్పుడు మాత్రం ఆ కెమిస్ట్రీ కనిపించలేదు.
డొల్ల స్క్రీన్ ప్లేతో రాసుకున్న ఓ కథకు గ్లాసీ సెటప్, కలర్ ఫుల్ గ్రాఫిక్స్ జోడించడానికి చేసిన విశ్వప్రయత్నం మాత్రం తెరపై కనిపించింది.
ప్రేమకు, విధికి మధ్య జరిగిన యుద్ధం అంటూ రాజమౌళి వాయిస్ ఓవర్ తో ‘రాధేశ్యామ్’ సినిమా మొదలవుతుంది. 1976, నవంబర్ 26న జరిగిందంటూ సముద్ర గర్భంలో కొన్ని సన్నివేశాలు చూపించి, ఫ్లాష్ బ్యాక్ మొదలుపెడతారు. హస్తసాముద్రికం నిపుణుడిగా ప్రభాస్ ను, డాక్టర్ గా ప్రేరణను చూపిస్తారు. కృష్ణంరాజుతో ప్రభాస్ కు ఇచ్చిన ఎలివేషన్ కూడా బాగుంది. కానీ ఎప్పుడైతే ప్రభాస్-పూజా మధ్య ప్రేమను ప్రారంభించాల్సి వచ్చిందో, అప్పుడిక దర్శకుడు చేతులెత్తేశాడు. రొమాన్స్ పేరిట ఏవేవో సన్నివేశాలు తెరనిండా పరిచేశాడు.
ఒక సీన్ లో యాక్సిడెంట్ అయి ప్రేరణ పనిచేస్తున్న హాస్పిటల్ కు వస్తాడు ప్రభాస్. చనిపోవడం ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఆ ఎపిసోడ్ లో ప్రభాస్ చేసిన హంగామా బోర్ అనిపిస్తుంది. అసలు దాన్ని రొమాంటిక్ సీన్ అంటారా? ఇలాంటి సన్నివేశాలు చాలానే పడ్డాయి సినిమాలో. దీంతో కెమిస్ట్రీ గాల్లో కలిసిపోయింది. బోరింగ్ అనేది ముందుసీట్లో కూర్చుంది. ఇంటర్వెల్ కు ముందు ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు మినహా.. మిగతా కథను దర్శకుడు సీరియస్ గా రాసుకున్నట్టు అనిపించదు.
అలా అని ఈ స్టోరీ ఐడియా కూడా పెద్ద గొప్పదేం కాదు. గతంలో ‘మురారి’ సినిమాలో ఈ కాన్సెప్ట్ ను కొద్దిగా చూసేశాం. ఇక జబ్బు పడిన హీరోయిన్ పాత్రను, అలాంటి అమ్మాయితో హీరో రొమాన్స్ ను ‘గీతాంజలి’లోనే చూసేశాం. గీతాంజలిలో ‘లేచిపోదాం ఎపిసోడ్’ లా, రాధేశ్యామ్ లో ముద్దుల ఎసిపోడ్ ఒకటి ఉంది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీరోహీరోయిన్లు ముద్దుల గురించి మాట్లాడుకుంటుంటే.. అసలు వీళ్లిద్దరు ఎప్పుడు ముద్దులు పెట్టుకున్నారబ్బా అనే డౌటానుమానం మనకు కలుగుతుంది.
జీవితంలో అంతా విధిని నమ్ముతారు కానీ ఒక్క శాతం మాత్రం తమ విధిని తామే రాసుకుంటారు. అలాంటి వాళ్లే చరిత్రను సృష్టిస్తారనే పాయింట్ ను చెప్పడానికి దర్శకుడు ప్రయాసపడ్డాడు. దాని కోసం ప్రేమ అనే ఎలిమెంట్ ను వాడుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది కాస్తా బెడిసికొట్టింది.
ఈ మొత్తం సినిమాలో హిట్టయిన సాంగ్ ‘ఈ రాతలే’. వినడానికి చాలా బాగున్న ఈ పాట చూసేటప్పుడు మాత్రం ఆకట్టుకోలేదు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరనప్పుడు.. గ్రాఫిక్స్, సెట్స్ అంటూ ఎన్ని హంగులు అద్దినా ప్రయోజనం ఉండదు. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని నిమిషాలు సినిమా ఎట్రాక్ట్ చేసినప్పటికీ.. క్లైమాక్స్ కు వచ్చేసరికి మళ్లీ ఆశించిన ఇంపాక్ట్ కనిపించలేదు. షిప్ ఎపిసోడ్ ను, ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్ని సరిగ్గా రాసుకోలేదు. సినిమా రిలీజ్ కి ముందు…. ఈ షిప్ ఎపిసోడ్ ని టైటానిక్ చిత్రంతో పోల్చారు. కానీ, ఈ సన్నివేశాల్లోనే గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి. పైగా, షిప్ తో పాటు కథ కూడా మునిగిపోయింది.
ప్రభాస్ మాత్రం తన వంతు కృషి చేశాడు. బాహుబలి, సాహో లాంటి రెండు పెద్ద యాక్షన్ డ్రామాలు చేసిన తర్వాత లవర్ బాయ్ గా కనిపించి మెప్పించాడు. ఫేస్ లో గ్రాఫిక్స్ వల్ల వచ్చిన మెరుపో, మరేమో గానీ కొన్ని చోట్లా చాలా బాగున్నాడు. ప్రేరణగా పూజాహెగ్డే మెరిసింది. ఆమె అందం ఈ సినిమాకి హైలెట్. పరమహంస పాత్రలో కృష్ణంరాజు ఈ కథకు కొంత బలం చేకూర్చే ప్రయత్నం చేశారు. వీళ్లు ముగ్గురు మినహా మిగతావాళ్లంతా బొమ్మల్ని తలపించారు. వాళ్లకు ఎలాంటి సీన్లు, మంచి డైలాగులు లేకుండా చేశారు. అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రభాస్ తల్లిగా నటించడానికి ఎందుకు ఒప్పుకుందో ఆమెకు, ఆ భగవంతుడికే తెలియాలి. ఇక టాలీవుడ్ బెస్ట్ నటుల్లో ఒకడిగా పేరుతెచ్చుకున్న మురళీశర్మకు కనీసం డైలాగ్ కూడా ఇవ్వలేదు. కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి పేరుకు ఉన్నారంటే ఉన్నారంతే. అదేంటోగానీ ఓ సీన్ లో, అప్పటివరకు కనిపించని తేజశ్వి, సడెన్ గా ప్రత్యక్షమై ఓ డైలాగ్ కూడా చెప్పేస్తుంది. ఇక జగపతిబాబు ఎపిసోడ్ పెట్టాల్సిన అవసరమే లేదు.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అదిరింది. రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ అద్భుతమనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రవీందర్ సెట్ లు వెయ్యడానికే సినిమా తీశారేమో అనిపిస్తోంది. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలానే ఉంది.
ఓవరాల్ గా రాధేశ్యామ్ సినిమాలో గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ కనిపిస్తాయి. కానీ దర్శకుడు, రచయిత బృందం కనీసమాత్రంగా కూడా పని చెయ్యలేదు. చంద్రశేఖర్ యేలేటి స్టోరీ ఐడియాని తీసుకొని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ కథని వండాడు. ఈ డైరెక్టర్ కి చిన్న చిన్న సీన్లు కూడా రాయడం రాదని అర్థమైంది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్లు, కామెడీ పేరుతో రాసుకున్న సన్నివేశాలు చూస్తే …ఇలాంటి సీన్లు రాసిన దర్శకుడికి 300 కోట్ల బడ్జెట్ ఇచ్చిన నిర్మాతల ధైర్యాన్నీ చూసి ఆశ్చర్యపోవాలి. స్క్రిప్ట్ లో దమ్ము లేకుండా వందల కోట్ల పెట్టుబడి పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదని ‘రాధేశ్యామ్’ మరోసారి నిరూపించింది.
Rating: 2/5
By: పంచ్ పట్నాయక్
Veteran filmmaker M. S. Raju says his upcoming thriller “Agadha” is one of the most…
Landing a role alongside Megastar Chiranjeevi is a dream opportunity for many actresses, and Ashika…
The makers of “Aadarsha Kutumbam” have officially unveiled Srinidhi Shetty's character from the film. After…
Anna Konidala, the wife of Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan, has…
Veteran Telugu actress Pavala Shyamala, known for her character roles and impeccable comic timing, passed…
Actor NTR has suffered a shoulder injury and has been advised complete rest for six…