Advertisement
తెలుగు న్యూస్

బ్రో మూవీ – తెలుగు రివ్యూ

వినోదాయం శితం.. ఓ సింపుల్ కథ, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, మంచి ఫ్యామిలీ మూమెంట్స్… తక్కువ బడ్జెట్ లో వచ్చిన చిన్న సినిమా ఇది. ఓ మంచి సందేశాన్ని సూటిగా సున్నితంగా ఇందులో చెప్పారు. ఈ సినిమాకు రీమేక్ గా వచ్చింది బ్రో. అదే సందేశాన్ని ఇందులో కూడా చెప్పారు. కానీ ఎక్కడ చెప్పారో వెదుక్కోవాల్సిన పరిస్థితి. హీరోయిజం, సాంగ్స్, పేరడీలు, స్టార్ డమ్, భారీ హంగులు.. ఇవన్నీ “బ్రో”లో ఉన్నాయి. దీంతో చెప్పాల్సిన పాయింట్ ఓ మూలకు వెళ్లిపోయింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, సందేశం ఇవ్వొచ్చు. కానీ అలా ఇవ్వాలంటే మంచి ఎమోషన్స్ పండాలి, సన్నివేశాలు కుదరాలి. అవి బ్రో మూవీలో మిస్సయ్యాయి.

“బ్రో” సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటి 15 నిమిషాల్లోనే వచ్చేస్తారు. అది కూడా మాస్ లెవల్ ఎంట్రీతో. తన పాత సినిమాలో పాటతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఆ పాటల సీక్వెన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కడా తగ్గదు సరికదా, మధ్యమధ్యలో ఇంకాస్త శృతిమించుతుంది కూడా.

ప్రారంభంలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, అతడి పాత సినిమాల రిఫరెన్సులు వస్తే భలే ఇరికించారే అనిపిస్తుంది. అలా సినిమాలోకి వెళ్లేకొద్దీ పవన్ రిఫరెన్సులు పెరిగిపోతాయి. దీంతో ఒక దశలో చిరాకు వస్తుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల్సిన ఫ్యామిలీ సీన్ దగ్గర కూడా భీమ్లానాయక్ థీమ్ పెట్టారు. అంతలా మొహం మొత్తేలా పవన్ సినిమాల రిఫరెన్సులు వాడేశారు.

“భవిష్యత్తు గురించి ఆలోచన వద్దు, గతం గురించి బాధ వద్దు, ఈ క్షణాన్ని ఆస్వాదించు, ఉన్నది ఒకటే జీవితం” అనే సందేశాన్ని బ్రో సినిమాతో చెప్పాలనుకున్నారు. ఒరిజినల్ సినిమాలో దీన్ని బాగా చెప్పారు, రీమేక్ కు వచ్చేసరికి రీమిక్సులు ఎక్కువైపోయాయి. నిజానికి ఈ కథ ఓ నీతి పాఠం. జీవితం ప్రయోజనం ఏంటి? మనం పోయిన తర్వాత ప్రపంచం ఎలా పనిచేస్తుంది? మనకు కావాల్సిన వ్యక్తులు మన మరణాన్ని ఎలా ఎదుర్కొంటారు? లాంటి అంశాల్ని డైలాగుల రూపంలో ఇందులో చర్చించారు. ఐతే పవన్ అభిమానులను అలరించే ఉద్దేశంతో పాటు ప్రేక్షకుడికి వినోదం అందించడం కోసం పెట్టిన ఎలిమెంట్స్, అసలు కథను పూర్తిగా నిరుగార్చాయి.

సినిమాలో హీరో పేరు మార్క్ అలియాస్ మార్కండేయులు. టైమ్ లేదంటూ జీవితాన్ని గడిపే మార్కు, కుటుంబాన్ని తను ఒక్కడ్నే పెంచి పోషిస్తున్నానే భ్రమలో ఉంటాడు. అదే క్రమంలో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతాడు. అతడికి టైటన్ రూపంలో కాలం (పవన్ కల్యాణ్) ఎదురవుతుంది. మరోసారి బతికే ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు మార్క్ తన తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు, కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడనేది కథ. ఒరిజినల్ లో ఈ కాన్ ఫ్లిక్ట్ కు ముందే హీరో (మిడిల్-ఏజ్డ్ వ్యక్తి) చేసిన తప్పుల్ని చూపిస్తాడు దర్శకుడు. దాన్ని అతడు సరిదిద్దుకొని, అందరి ప్రేమను పొంది ప్రశాంతంగా కన్నుమూస్తాడు. కానీ రీమేక్ కు వచ్చేసరికి.. తిరిగి బతికే అవకాశం అందుకున్న హీరో.. ఆ తర్వాత ఎక్కువ సార్లు పబ్బుల్లో కనిపిస్తాడు. ఈ రీమేక్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు.

ఇలాంటి సినిమాలు పండాలంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుండాలి. బ్రో సినిమాలో ఎక్కడా తల్లికొడుకు, అన్నచెల్లెలు ఎమోషన్స్ ను చూపించలేదు. వాళ్లతో ఎక్కువ సీన్లు ఉన్నప్పుడే కదా క్లయిమాక్స్ లో ఎమోషనల్ గా కనక్ట్ అవ్వగలం. వాటి బదులు పవన్, సాయిధరమ్ తేజ్ బాండింగ్ చూపించడానికే దర్శకరచయితలు ఎక్కువ కష్టపడ్డారు. దీంతో ఇది రీమేక్ అవ్వకుండా రీమిక్స్ అయింది.

సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. మేనమామ-మేనల్లుడి కెమిస్ట్రీ చూడ్డానికి బాగుంది. సాయితేజ్ బ్రో అని పిలవడం, పవన్ కల్యాణ్ మార్క్ అని సంబోధించడం బాగున్నాయి. దేవుడిగా పవన్ కల్యాణ్ నటన కొంత వెరైటీగా ఉంది. ఈమధ్య కాలంలో ఏకథాటిగా ప్రసంగాలిస్తున్న పవన్ కల్యాణ్, సినిమాలో కొన్ని జీవిత సత్యాలు చెబుతుంటే వినడానికి బాగుంది. సాయితేజ్ యాక్టింగ్ లో, డిక్షన్ లో కంప్లయింట్స్ ఉన్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన అతడు తేరుకోవడానికి ఇంకొన్నాళ్లు పడుతుంది.

హీరోయిన్లకు ఈ కథలో చోటు లేదు. కేతిక శర్మ పాత్రను ఓ పాట కోసం ఇలా వాడుకొని మెల్లగా సైడ్ చేశారు. ప్రియా ప్రకాష్ వారియర్ క్యారెక్టర్ కూడా అంతే. కొన్ని పాత్రలైతే ఎందుకున్నాయో అర్థంకాదు. బ్రహ్మానందం పాత్ర ఒక సీన్ కు పరిమితం కాగా.. 30 ఇయర్స్ పృధ్వీ పాత్రను ఎందుకు పెట్టారో మేకర్స్ కే తెలియాలి. సుబ్బరాజు రోల్ అంతే. ఎక్కడపడితే అక్కడ ఆ క్యారెక్టర్ ను కట్ చేశారనే విషయం తెలుస్తూనే ఉంటుంది.

టెక్నికల్ గా చూస్తే సినిమాలో సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ అందించిన పాటలు పట్టించుకోనక్కర్లేదు కానీ, సినిమాకు అతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.

ఓవరాల్ గా “బ్రో” సినిమాను, ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓసారి చూడొచ్చు. కానీ ఒరిజినల్ మూవీ చూసిన వాళ్లకు ఇది నచ్చదు.

బాటమ్ లైన్: రీమేక్ కాదు.. రీమిక్స్

Rating: 2.75/5

By M Patnaik

Advertisement

This post was last modified on July 28, 2023 11:39 pm

Advertisement
Share