Advertisement
తెలుగు న్యూస్

ఏపీలో ‘బంగార్రాజు’కి ప్రత్యేక మర్యాద!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి నాగార్జునకి మధ్య స్నేహం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలోనూ ఆయనకి పరోక్షంగా అండగా నిలబడ్డవారిలో నాగార్జున ఒకరు. అందుకే, నాగ్ అంటే సీఎం జగన్ కి ప్రత్యేక అభిమానం. ఆ కారణం వల్లే ఏపీలో ప్రస్తుతం ‘బంగార్రాజు’కి ప్రత్యేక మర్యాదలు లభిస్తున్నాయి.

ఈ సినిమా కోసమే ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా వేశారన్న ప్రతిపక్షాల విమర్శల్లో పెద్దగా బలం లేదు. కానీ, ఇతర విమర్శలు మాత్రం నిజమనిపిస్తున్నాయి. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచి థియేటర్లలో నడిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం కిమ్మనలేదు. దాంతో, ఆంధ్రాలో ‘బంగార్రాజు’కి మొదటి నాలుగు రోజులు సూపర్ రెవెన్యూ వచ్చింది. అలా, నాగ్ కి లాభం కలిగేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి (జనవరి 18న) కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నైట్ కర్ఫ్యూ, 200కి మించి ఒక చోట గుమికూడకుండా ఉండడం వంటి నిబంధనలను రాష్ట్రమంతా అమల్లోకి తెచ్చారు. కోవిడ్ కట్టడికి మంచి చర్యలు మొదలు పెట్టారు సీఎం జగన్. ఐతే, నాగార్జున కోసం ఈ నిబంధనలను పక్కన పెట్టడం విమర్శలకి తావిచ్చింది.

ఈ రోజు రాత్రి రాజమండ్రిలో ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్ జరిగింది. అభిమానుల సమక్షంలో నిర్వహించారు. వేల సంఖ్యలో కాకపోయినా ‘200’ మంది రూల్ కి మించి అభిమానులు వచ్చారు. అసలు పోలీసులు దీనికి ఎలా అనుమతిచ్చారో తెలియదు. నాగార్జున కోసమే ఈ ప్రత్యేక మర్యాద అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే, రిలీజ్ కి ముందే నాగార్జున “ఏపీ టికెట్ రేట్లతో నా సినిమాకి సమస్య లేదు” అన్నారు. బహుశా ఆయనకి ముందే తెలిసి ఉండొచ్చు తన సినిమాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని.

Advertisement

This post was last modified on January 18, 2022 9:53 pm

Advertisement
Share