Advertisement
తెలుగు న్యూస్

రికార్డులు … బద్దలు!


పవన్ కళ్యాణ్ నటించిన “జల్సా” సినిమా మళ్ళీ విడుదలైంది. కలెక్షన్ల పరంగా, షోల పరంగా ఇంకోసారి ఊపింది. ఐతే, ఇక్కడే ఒక సమస్య. విశాఖపట్నంలో ఒక థియేటర్లో అభిమానులు నానా హంగామా చేసి సీట్లు ఇరగ్గొట్టారు.

గత నెల ‘పోకిరి’ మళ్ళీ విడుదలైనప్పుడు మహేష్ బాబు అభిమానులు కాకినాడలో ఇలాగే థియేటర్లో రభస సృష్టించారు. సీట్ల కవర్లను చించారు. అద్దాలు పగలగొట్టారు. దాంతో, కాకినాడలో ఇక బెనిఫిట్ షోలు వేయొద్దని థియేటర్ల యజమానులు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల వంతు.

థియేటర్లో ఎగరడం, పేపర్లు విసరడం, డ్యాన్స్ చెయ్యడం చేస్తుంటారు అభిమానులు. ఇలాంటి వాటికి థియేటర్ల యజమానులు అభ్యంతరం చెప్పరు. కానీ, లక్షల రూపాయల ఖర్చు పెట్టి చేయించిన సీట్లను విరగ్గొట్టడ్డం, అద్దాలు పగలగొట్టడం క్షమించరాని తప్పు. అభిమానులమని ఏది పడితే అది చేస్తే నష్టం ఎవరు భరించాలి? ఎందుకు ఓర్చుకోవాలి?

‘జల్సా’ 4కే కోసం 700కి పైగా షోలు నడిచాయి. అమెరికాలో కూడా బాగా ఆడింది. ఇవన్నీ రికార్డులు. ఇలాంటి రికార్డులు బద్దలు కొట్టాలి, కానీ ఫర్నిచర్ ని బద్దలు కొట్టొద్దు. ఈ విషయాన్నీ హీరోల అభిమానులు గ్రహిస్తే మంచిది. లేదంటే ఇవన్నీ థియేటర్ల యజమానులు ఆపేస్తారు అన్ని చోట్లా.

Advertisement

This post was last modified on September 2, 2022 11:08 pm

Advertisement
Share