Advertisement

తెలుగులో చాలా స్పోర్ట్స్ డ్రామాలొచ్చాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఐతే, తన కెరీర్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా లేదనే వెలితి కారణంగా ఆ జాన్రాలో “గని” ఒప్పుకున్నారు వరుణ్ తేజ్. దాదాపు రెండేళ్లు వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశారు .

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కు బలమైన హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేస్తే కచ్చితంగా క్లిక్ అవుతుందని నమ్మకంతో ఈ సినిమాని మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. “జెర్సీ” సినిమాలో జరిగిందదే. వాళ్ల ఆలోచన కరెక్టే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం “గని” మిస్ కొట్టింది.

బాక్సింగ్ లో నేషనల్స్ వరకూ వెళ్లి ఓడిపోయిన విక్రమాదిత్య (ఉపేంద్ర) స్టెరాయిడ్స్ తీసుకున్నాడనే కారణంతో ఏడాది పాటు బ్యాన్ చేస్తారు. తండ్రి చేసిన తప్పు కారణంగా చిన్నతనం నుండి అందరితో ఛీటర్ అనిపించుకుంటాడు గని (వరుణ్ తేజ్). తన తండ్రి ఏ గేమ్ లో అయితే ఓడిపోయి తనకి చీటర్ అనే బిరుదు తెచ్చాడో అదే గేమ్ లో తను నేషనల్ ఛాంపియన్ గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు గని. అయితే అతడి తల్లి (నదియా)కి అది ఇష్టం ఉండదు. దీంతో అమ్మకు తెలియకుండా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటాడు గని.

నిత్యం తండ్రిని అసహ్యంచుకునే గనికి, కొన్ని చేదునిజాలు తెలుస్తాయి. గతంలో తన తండ్రికి ప్రత్యర్థిగా బాక్సింగ్ రింగ్ లో నిలిచిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్ విజేంద్ర సిన్హా (సునీల్ శెట్టి), విక్రమాదిత్యకు సంబంధించిన వివరాలు బయటపెడతాడు. చివరికి గని నేషనల్ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది సినిమా కథ.

స్పోర్ట్స్ డ్రామాల్లో క్లైమాక్స్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ కార్డు పడినప్పుడే, శుభం కార్డు ఏంటనేది ప్రేక్షకుడికి ఐడియా ఉంటుంది. గెలిచేది హీరోనే అని ఆడియన్స్ ఫిక్స్ అయినప్పుడు ఆ రెండు కార్డుల మధ్య సినిమాను మరింత ఆసక్తికరంగా చూపించడం అనేది అత్యంత కీలకమైన విషయం. ఈ విషయంలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఫెయిల్ అయ్యాడు.

మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే పేలవంగా ఉంది. సీన్ బై సీన్ పేర్చుకుంటూ వెళ్లారు తప్ప ఎలాంటి అనుభూతిని అందించదు. కథ కాలేజ్ క్యాంపస్ కు షిఫ్ట్ అయిన తర్వాత మరింత ఇబ్బంది పెడుతుంది. హీరోయిన్ తో ప్రేమ, పొలిటీషియన్ కొడుకుతో వైరం లాంటివి అవసరమా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు “గని” సినిమా సాదాసీదాగా సాగిపోతుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుందో, ఆ తర్వాత కథ కాస్త ఊపునిస్తుంది.

ఈ సినిమాకు ప్రధానమైన లోపం ఎమోషన్స్ పండకపోవడమే. తెరపై పెద్ద పెద్ద నటీనటులున్నప్పటికీ బలమైన సన్నివేశాలు, సరైన డైరక్షన్ లేక ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఉదాహరణకు వరుణ్ తేజ్, నదియానే తీసుకుంటే.. ఈ తల్లీకొడుకు మధ్య బాండింగ్ పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. ఇక అద్భుతంగా పండాల్సిన వరుణ్ తేజ్, నవీన్ చంద్ర ఎపిసోడ్ కూడా తుస్సుమంది. ఇలాంటి ఎన్నో ఆసక్తి కలిగించని ఎపిసోడ్స్ మధ్య ఫస్టాఫ్ ఫ్లాట్ గా ముగుస్తుంది. అదృష్టవశాత్తూ ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సినిమాను ట్రాక్ పైకి తీసుకొస్తుంది. కానీ అది అటుఇటుగా 15 నిమిషాలకే ముగుస్తుంది.

మిగతాదంతా క్రీడల్లో రాజకీయాలు, ప్రతీకారం, బాక్సింగ్ తోనే నిండిపోతుంది. ఇదంతా ప్రతి సినిమాలో చూసే రొటీన్ వ్యవహారమే. సినిమాలో హీరోహీరోయిన్ల రొమాన్స్ కు స్కోప్ లేకపోవడంతో, బలవంతంగా ఓ ఐటెంసాంగ్ (తమన్న చేసింది) పెట్టారు. ఇలా బలవంతంగా ఇరికించిన పాట, సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. ఉన్నంతలో సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది.

ఈ మొత్తం సినిమాలో ఘనంగా చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే అది వరుణ్ తేజ్ తపన, అతడి లుక్. బాక్సర్ గా వరుణ్ సరిగ్గా సరిపోయాడు. ఈ క్యారెక్టర్ కోసం అతడు ఎంత కష్టపడ్డాడో కొన్ని సన్నివేశాలు చూస్తే తెలుస్తుంది. గని పాత్రకు న్యాయం చేశాడు వరుణ్. వరుణ్ తర్వాత ఉపేంద్ర పార్ట్ బెస్ట్ అనిపించుకుంటుంది. సునీల్ శెట్టి, నదియా ఓకే అనిపించుకోగా.. జగపతిబాబు మరోసారి మూస పాత్రలో కనిపించాడు. కొత్తమ్మాయి సయీ మంజ్రేకర్ కు ఈ సినిమా మంచి డెబ్యూ మూవీ అనిపించుకోదు.

ఇక టెక్నికల్ గా చూసుకుంటే. ఆశ్చర్యకరంగా ఈసారి తమన్ కూడా బలం కాలేకపోయాడు. గని టైటిల్ సాంగ్ తప్ప, మిగతా పాటలేవీ ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఇక నిర్మాతల విషయానికొస్తే, ఈ కథపై నమ్మకంతో బాబి, సిద్ధు బాగా ఖర్చుపెట్టారు. మూవీ మొత్తం రిచ్ గా కనిపిస్తుంది.

ఫైనల్ పంచ్: బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన “గని” సినిమా సగటు స్పోర్ట్స్ డ్రామాలా తేలిపోయింది. వరుణ్ తేజ్ కష్టం మినహా సినిమాలో ఎలాంటి పంచ్ లు కనిపించవు.

Rating: 2.5/5

By: పంచ్ పట్నాయక్

Advertisement

This post was last modified on April 8, 2022 4:44 pm

Advertisement
Share