Advertisement
తెలుగు న్యూస్

ఖిలాడీ మూవీ – తెలుగు రివ్యూ

అంచనాకు, వాస్తవానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్ లో ఎక్స్ పెక్టేషన్స్ వెర్సెస్ రియాలిటీ అంటారు. ఏదో ఊహించుకుంటాం, ఇంకేదో జరుగుతుంది. ఆశాభంగం ఎదురవుతుంది. “ఖిలాడి” సినిమా విషయంలో అదే జరిగింది. భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓస్ ఇంతేనా అనేలా ఉంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ యాక్షన్ సన్నివేశాలు.. ఇలా ఎన్ని పెట్టినప్పటికీ, కథను గాలికొదిలేస్తే ఎవరేం చేయలేరు అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది ఖిలాడీ.

ఇటలీ నుంచి రహస్యంగా 10వేల కోట్ల రూపాయల కంటైనర్ ఇండియాకొస్తుంది. ఆ డబ్బుతో ఎమ్మెల్యేల్ని కొనేసి, సీఎంను దించేసి, తను ముఖ్యమంత్రి అయిపోవాలనేది హోం మినిస్టర్ (ముకేష్ రుషి) ప్లాన్. మరోవైపు క్రిమినాలజీ చదువుతున్న పూజ (మీనాక్షి చౌదరి), జైలులో ఉన్న మోహన్ గాంధీ (రవితేజ)పై థీసిస్ చేయాలని అనుకుంటుంది. భార్యతో (డింపుల్ హయాతి) పాటు కుటుంబ సభ్యుల్ని చంపేసిన అభియోగాలపై మోహన్ గాంధీ శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకొని, అతడి గతం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కన్న తల్లిదండ్రులతో పాటు భార్యను మోహన్ గాంధీ ఎందుకు చంపుకుంటాడు? 10వేల కోట్ల బ్లాక్ మనీకి ఇతడికి ఏంటి సంబంధం అనేది సినిమా స్టోరీ.

ఇంట్రెస్టింగ్ సెటప్ తో సినిమా మొదలవుతుంది. ఈ విషయంలో రమేష్ వర్మ తన చమక్కు చూపించాడు. హీరోపై అభియోగాలు మోపడం, అతడు మనీ ల్యాండరింగ్ చేయడం లాంటివి ఆసక్తికరంగా సాగుతాయి. భార్యనే చంపేశాడనే పాయింట్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ తర్వాత నుంచి మాత్రం మనం వందల సినిమాల్లో చూసేసిన స్టఫ్ రిపీట్ అవుతుంది. హీరోకు ఓ బ్యాక్ స్టోరీ ఉండడం, అతడిలో రెండు రకాల షేడ్స్ కనిపించడం లాంటివి మనకు తెలిసినవే. అంతేకాదు, తన భార్యను హీరో చంపలేదనేది విషయాన్ని కూడా ప్రేక్షకుడు ఈజీగానే గెస్ చేయొచ్చు.

ఖిలాడీ ప్రథమార్థం మొత్తం మనకు తెలిసినట్టుగానే సాగుతుంది. ఆసక్తికరమైన సెటప్, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్, ప్రీ-ఇంటర్వెల్ లో భారీ ట్విస్ట్.. ఇలా నడుస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన టెంప్లేట్ అయినప్పటికీ ఏదోలా చూద్దామనిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మంచి పాటలు, ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నాయి. ఇలానే సెకెండాఫ్ ను కూడా కొనసాగిస్తే బాగుండేది. కానీ అక్కడే తేడా వచ్చింది.

ఫస్టాఫ్ లో ఫాలో అయిన పద్ధతిని, సెకెండాఫ్ కు వచ్చేసరికి వదిలేశాడు దర్శకుడు. ఏమి చెయ్యాలనుకున్నాడో, మరింత థ్రిల్ ఇవ్వాలనుకున్నాడో తెలీదు కానీ.. నెరేషన్ కంటే, ట్విస్టులు మీద ఎక్కువగా ఆధారపడ్డాడు. సరిగ్గా ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. ఆ ఇచ్చిన ట్విస్టులేవో గట్టిగా ఉంటే బాగుండేవి. సగడు ప్రేక్షకుడు కూడా ఊహించేసుకునేలా ఉన్నాయవి. అయినప్పటికీ దర్శకుడు తగ్గలేదు. సెకెండాఫ్ మొత్తం ట్విస్టులు ఇచ్చే పనిమీదే ఉన్నాడు. చివరికి క్లైమాక్స్ లో కూడా 2-3 ట్విస్టులిచ్చి ప్రేక్షకుడ్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకున్నాడు. అక్కడితో కూడా ఆగకుండా, సీక్వెల్ కూడా ఉందంటూ హింటిచ్చి పడేశాడు.

ఓ దశలో మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా …. దర్శకుడు కన్ఫ్యూజ్ అయి మనల్ని అయోమయంలో పడేశాడా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ ఒక్క ట్రీట్ మెంట్ తో సినిమా ఫలితమే మారిపోయింది. ఇక చాలురా బాబూ అంటూ ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకొచ్చాడంటేనే రిజల్ట్ ఊహించుకోవచ్చు. చేయి తిరిగిన దర్శకుడు మాత్రమే ట్విస్టుల్ని అద్భుతంగా పండించగలడు. కేవలం రాసుకుంటే సరిపోదు. దానికో సెటప్ కావాలి. ట్విస్ట్ పండాలంటే చాలా కుదరాలి. సగటు తెలుగు సినిమాలో ఉన్నట్టుగానే ఇందులో కూడా లాజిక్ ను గాలికొదిలేసి, ఇదింతే సర్దుకుపొమ్మన్నారు.

హీరో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం సర్వసాధారణం. కానీ ఖిలాడీలో చాలామంది నటీనటులు ఇలానే కనిపించి కన్ఫ్యూజ్ చేస్తారు. అవేవీ ఆకట్టుకోకపోవడం మైనస్. ఈ సొంపుకి హీరో షేడ్స్ కు ఎలాంటి పర్పస్ లేకపోవడం బాధాకరం. ఈ సంగతి పక్కనపెడితే, రవితేజ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్యారెక్టర్ కు తన ఎనర్జీని జోడించి సీనియారిటీ చూపించాడు. అర్జున్ ఇలాంటి పోలీసాఫీసర్ పాత్రలు ఎందుకు చేస్తున్నాడో అర్థంకాదు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. మీనాక్షి, డింపుల్ అందాలు చూపించడానికి పోటీపడ్డారు. ఇక డింపుల్ అయితే ఎక్స్ పోజింగ్ చేయడానికి అస్సలు మొహమాటపడలేదు. ఆమె ఇచ్చిన డబ్బుకు ఫుల్లు న్యాయం చేసింది. ఆశ్చర్యంగా అనసూయ కూడా ఓవర్ డోజ్ అఫ్ గ్లామరస్ గా కనిపించింది. వెన్నెల కిషోర్, మురళీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు.

దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన వాటిలో 3 పాటలు బాగున్నాయి. నిర్మాతల ఖర్చు సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది.

ఓవరాల్ గా రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన “ఖిలా”డీ సినిమాను ట్విస్టులు, టర్నులు, హీరోయిన్ల అందాలతో గట్టెక్కించాలని ప్రయత్నం చేశారు. కానీ నెరేషన్ లో పస లేకపోవడం, హీరోయిజం పండకపోవడం ఈ సినిమాను నీరసంగా మార్చేశాయి.

Rating: 2.25/5

‘పంచ్’ పట్నాయక్

Advertisement

This post was last modified on February 11, 2022 4:29 pm

Advertisement
Share