Advertisement
తెలుగు న్యూస్

లక్ష్య మూవీ – తెలుగు రివ్యూ

టైటిల్ లో టార్గెట్ ఉంది. ఏ లక్ష్యంతో అయితే ఈ సినిమా తీశారో, ఆ లక్ష్యం నెరవేరిందా? ఇంతకీ ఈ ‘లక్ష్య’లో ఏముంది..?

పార్థు (నాగశౌర్య) విలుకారుడు. విలువిద్యలో అతడికి తిరుగుండదు. దీంతో కొడుకుతో నెరవేరని కలను మనవడితో తీర్చుకోవాలని భావిస్తాడు పార్థు తాత రాఘురామయ్య (సచిన్ ఖేడ్కర్). మనవడి కోసం ఆస్తుల్నే కాదు, తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయడు. పార్థు కూడా తాత కళ్లలో ఆనందం కోసం కష్టపడతాడు. స్టేట్ మెడల్ కొడతాడు. అయితే అనుకోకుండా పార్థు తాత మరణిస్తాడు. దీంతో పార్థు డిస్టర్బ్ అవుతాడు. మద్యానికి బానిసవుతాడు. స్నేహితుడు రాజేష్ (కిరిటీ) చెప్పిన మాటలు విని డ్రగ్స్ కు అలవాటుపడతాడు.

ఈ క్రమంలో ఆర్చరీలో పార్థుకు పోటీగా ఉన్న రాహుల్ (శత్రు), పార్థుపై ఎటాక్ చేసి, అతడి కుడిచేయి మణికట్టును గాయపరుస్తాడు. ఇంతకీ అతడి ఫ్రెండ్ ఉద్దేశం ఏంటి, రాహుల్ ఏమయ్యాడు? ఫైనల్ గా పార్థు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది ఈ సినిమా కథ

ఆటల నేపథ్యంగా సాగే కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఆఖర్లో ఏమౌతుందనే చాలామందికి తెలుసు. అలాంటి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో కనిపించే మూస పద్దతిలోనే సాగింది ‘లక్ష్య’. ప్రొఫెషనల్ గా ఆడే విలువిద్య అనేది ఇంతవరకు తెలుగులో ఎవ్వరూ టచ్ చేయనిదే అయినప్పటికీ.. ఆ ఎలిమెంట్ తప్ప ఈ సినిమాలో కొత్తగా మరోటి కనిపించదు. అన్ని స్పోర్ట్స్ చిత్రాల్లో ఉండే సరుకు ఇందులో కూడా కనిపించింది. మరి ఎమోషన్ అయినా ఉండాలి కదా!

సినిమా మొదలైన అర్థగంటకే దర్శకుడి సత్తా మనకు తెలిసిపోతుంది. సంతోష్ జాగర్లపూడి రైటింగ్ మరీ పేలవంగా ఉంది. తెరపై కనిపిస్తున్న సన్నివేశాలు ఎలాంటి ప్రభావం చూపించకపోవడంతో, మొదలైన 30 నిమిషాలకే సీట్లలో అసౌకర్యంగా కదులుతాం. ఫస్టాఫ్ లో చెప్పుకోడానికి ఇష్యూస్ ఉన్నా…. ఓ విలుకాడి కలలు చెదిరిపోయే కథను చెప్పడానికి ఓ ప్రయత్నం చేశారనిపిస్తుంది. సెకెండాఫ్ మాత్రం తొలి భాగమే బావుంది కదా అని ఉసురుమనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రాయడంలో దర్శకుడికి అవగాహన లేదా లేక ఈ కథకు ఇది చాలు అని మమ అనిపించాడో అర్థంకాక తలగోక్కుంటాం.

ఇది చాలదన్నట్టు సెకెండాఫ్ లో జగపతిబాబు పాత్ర. “అక్కడ స్పేస్ లేదు కానీ ఆయన తీసుకున్నారు” అని త్రివిక్రమ్ ఎదో సభలో చెప్పినట్లు ఈ కథలో జగపతి బాబు పాత్రకి స్పేస్ లేదు కానీ దర్శకుడు ఎలాగోలా ఇరికించేశారు. ద్వితీయార్థంలో జగపతి బాబు పాత్రతో కథ రసవత్తరంగా మారాల్సింది మరింత జావగారింది.

పేపర్ పై ప్రాపర్ గా రాసుకోకపోతే తెరపై ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పడానికి ఉదాహరణ ఈ సినిమా ద్వితీయార్థం. ఉన్నంతలో సెకండాఫ్ లో చెప్పుకోదగ్గ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్ పార్ట్ మాత్రమే. కానీ అప్పటికే ఒంట్లో ఉన్న ఓపిక ఆవిరై, ఇక చాలు అనిపిస్తుంది. సినిమా పూర్తయిన తర్వాత బయటకొచ్చి ఆలోచిస్తే, సెకండాఫ్ లో స్టఫ్ ఏంలేదు కాబట్టి క్లైమాక్స్ నచ్చిందేమో అనిపిస్తుంది.

స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల్లో ఏ క్రీడను చెబుతున్నాం అనేది ముఖ్యం కాదు. ఆ ఆట ద్వారా ఆడియన్స్ కు ఎంత ఎమోషన్ అందిస్తున్నాం అనేది ముఖ్యం. “సై”సినిమాలో రగ్బీ గేమ్ కొత్తగా ఉందని ఆడియన్స్ ఆదరించలేదు, ఆ గేమ్ ద్వారా పండించిన ఎమోషన్ కనెక్ట్ అయింది కాబట్టి యావరేజ్ గా చూశారు. ఎవ్వరూ టచ్ చేయలేదు కాబట్టి ఆర్చరీని పెట్టేద్దాం అన్నట్టుంది తప్ప, ఆ ఆర్చరీ ద్వారా పండించాల్సిన ఎమోషన్ పై దృష్టిపెట్టినట్టు ఏ కోశాన కనిపించదు.

నాగశౌర్య చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించాడు. అందుకు మెచ్చుకోవాలి. కానీ ఈ కథకు అది అవసరమా అని అతనికి డౌట్ రావాల్సింది. సినిమాలో హీరో మారిన మనిషిగా చూపించేందుకు సిక్స్ ప్యాకే అవసరం లేదు. గడ్డం గీసినా సరిపోతుంది. పైగా కథ ప్రకారం కుడి చేతి మణికట్టు పని చెయ్యని సందర్భంలో హీరో సిక్స్ ప్యాక్ సాధించినట్లు చూపించారు. ఒక్క చేతితో ఆరు పలకల దేహాన్ని సాధించడం సాధ్యమా?

అతడి కష్టం మాత్రం వృధా అయిందనే విషయం చెప్పక తప్పడం లేదు. అయితే ఓ నటుడిగా నాగశౌర్య చేసిన హోమ్ వర్క్, పడ్డ కష్టానికి మెచ్చుకోవాల్సిందే. శౌర్య సిక్స్ ప్యాక్ ఎలా వృధా అయిందో, హీరోయిన్ కేతిక శర్మ అందాలు కూడా అదే విధంగా వృధా అయ్యాయి. సచిన్ ఖేడ్కర్, జగపతిబాబు తమ పాత్రల్ని చేసుకుంటూపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. దీని వల్ల బోర్ కొట్టినా బొమ్మ చూడాలనిపిస్తుంది.

బాటమ్ లైన్: ఓవరాల్ గా చెప్పాలంటే లక్ష్య సినిమా ఏ దశలోనూ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆర్చరీ నేపథ్యంలో సాగిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలాంటి ఎమోషన్ అందించదు. నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. నిర్మాతలు సినిమా కోసం రాజీపడకుండా నిర్మాణ విలువల కోసం ఖర్చు పెట్టారు. కానీ దర్శకుడి అపరిపక్వ కథనం వల్ల అవి వృధా అయ్యాయి.

Rating: 2.5/5

by ‘పంచ్’ పట్నాయక్

Advertisement

This post was last modified on December 10, 2021 5:00 pm

Advertisement
Share