Advertisement
తెలుగు న్యూస్

త్రివిక్రమ్ మరిన్ని పాటలు రాయాలా?

దర్శకుడు త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అంటారు. మాటల రచయితగా తెలుగుసినిమా రంగంపై విపరీతమైన ప్రభావం చూపిన స్టార్ రైటర్ ఆయన. 20 ఏళ్ల క్రితం ఆయన రచయితగా ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు పాటల రచయితగా కూడా ప్రయత్నాలు చేశారు. రవితేజ నటించిన “ఒక రాజు ఒక రాణి” (2003) చిత్రంలో అన్ని పాటలు ఆయన రాసినవే. ఆ సినిమా పరాజయం చెందడం, పాటలు తుస్సుమనడంతో మాటలు, డైరెక్షన్ ప్రస్థానమే కొనసాగించారు.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయన ఒక పాటకి తన పేరు వేసుకున్నారు. త్రివిక్రమ్ తీసే అన్ని సినిమాలకు పల్లవులు, హుక్ లైన్స్ త్రివిక్రమ్ ఇస్తారు. దాన్ని లిరిక్ రైటర్స్ డెవలప్ చేస్తారనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మొత్తం పాట రాసి, దానికి పేరు కూడా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’లో “లాలా భీమ్లా” అనే పాట ఆయన రాసిందే.

ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనం కోషియం’ అనే దానికి రీమేక్. అందులో ఇలాంటి పాట ఒకటి వుంది. దానికి త్రివిక్రమ్ తనదైన శైలిని జోడించి రాశారు. హీరోలను తెగ పొగుడుతూ, ఆకాశానికెత్తుతూ పాటలు రాయించుకోవడం త్రివిక్రమ్ కి మొదటినుంచి అలవాటు. “పెను తుపాన్ తలొంచే తొలి నిప్పు కణం అతడే”, “వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు…” ఇలాంటివి ఆయన శైలి. ఈసారి తానే రాసిన “లాలా భీమ్లా” పాటలో మైథాలిజీని కూడా లింక్ చేసి హీరోకి ఎలివేషన్స్ ఇచ్చారు.

“పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…” వంటి ఎలివేషన్ లు ఈ పాటలో కనిపిస్తాయి.

ఐతే, మంచి ఊపుతో సాగే ఈ పాట బాగుంది. ఒక గమ్మత్తైన ట్యూన్ (ఒరిజినల్ లో కూడా ఇదే శైలిలో ఉంటుంది) ఇది. మరి త్రివిక్రమ్ మరిన్ని పాటలు రాయాలంటారా? మీ అభిప్రాయం ఏంటి?

Advertisement

This post was last modified on November 9, 2021 10:39 am

Advertisement
Share