Advertisement
తెలుగు న్యూస్

రాజ రాజ చోర – తెలుగు రివ్యూ

హీరో దొంగతనాలు చేయడం చాలా సినిమాల్లో చూశాం. మరి అదే హీరో తన భార్యను మోసం చేస్తే, అదే హీరో తన గర్ల్ ఫ్రెండ్ ను కూడా మోసం చేస్తే, తిరిగి అదే హీరో ఇటు భార్యను, అటు గర్ల్ ఫ్రెండ్ ను ఒకేసారి మెయింటైన్ చేస్తే.. సరిగ్గా “రాజరాజ చోర” సినిమా ఇక్కడే కొత్తగా క(అ)నిపిస్తుంది.

జిరాక్స్ షాపులో వర్క్ చేసే భాస్కర్ (శ్రీ విష్ణు) తన భార్య విద్య (సునయన), పిల్లాడి చదువు కోసం అలాగే తన గర్ల్ ఫ్రెండ్ సంజన (మేఘ ఆకాష్) అవసరాలు తీర్చడం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజు వేషధారణలో దొంగతనం చేస్తూ పోలీస్ ఆఫీసర్ విలియమ్స్ రెడ్డి (రవిబాబు) కి పట్టుబడతాడు. భాస్కర్, విద్య భార్యభర్తలు అయినప్పటికీ ఇద్దరికి మాటలు ఉండవు. తన లాయర్ చదువుకి సంబంధించి ఫీజ్ కోసం మాత్రమే భాస్కర్ తో మాట్లాడుతుంది విద్య. ఈ క్రమంలో దొంగతనం చేస్తూ పోలీస్ కి పట్టుబడిన భర్తను తన లాయర్ బుర్రతో స్టేషన్ నుండి ఎలా బయిటికి తీసుకొచ్చింది? అసలు పెళ్ళాం ఉండగా భాస్కర్ సంజనతో ఎందుకు రిలేషన్ పెట్టుకున్నాడు? దొంగతనం కేసులో పట్టుబడిన భాస్కర్ ని పోలీస్ వదిలేశాడా? చివరికి భాస్కర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుందనేది ఈ సినిమా కథ.

ఇందులో హీరో దొంగ. కుటుంబ పోషణకు డబ్బు సంపాదించడం కోసం రకరకాల దొంగతనాలు చేస్తుంటాడు. అదే టైమ్ లో ఓ గర్ల్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేస్తాడు. ఒక దశలో ఆమెతో సెటిల్ అవ్వాలనుకుంటాడు కూడా. భర్త ఇలా చేస్తున్నాడని భార్యకు తెలీదు. బాయ్ ఫ్రెండ్ కు ఆల్రెడీ పెళ్లయిందని గర్ల్ ఫ్రెండ్ కు తెలీదు. ఓ తెలుగు హీరోకు ఇలాంటి క్యారెక్టరైజేషన్ చాలా కొత్త. అదే ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్.

అయితే చెప్పుకోడానికి ఇలా సెటప్ బాగున్నప్పటికి సినిమా మాత్రం ఇంత గొప్పగా మొదలవ్వదు. హీరో క్యారెక్టర్ తో పాటు మిగతా పాత్రల్ని పరిచయం చేయడానికి దర్శకుడు హసిత్ గోలి చాలా టైమ్ తీసుకున్నాడు. ఎప్పుడైతే హీరో-గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో ఇక అప్పట్నుంచి సినిమా ఊపందుకుంటుంది.

మొత్తానికి ఇక దొంగతనాలు మానేసి సెటిల్ అయిపోదామని నిర్ణయించుకున్న హీరో, చివరాఖరుగా ఓ దొంగతనానికి వెళ్తాడు. కానీ సరిగ్గా అక్కడే పోలీస్ కు దొరికిపోతాడు. ఈ స్క్రీన్ ప్లే లో బ్యూటీ ఏంటంటే సరదా ట్విస్టులు. హీరో ఫేక్ గాడు అని తెలిసిపోతుందనుకున్న టైమ్ లో దానికి రివర్స్ లో జరుగుతుంది. కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం హీరో, అతడి గర్ల్ ఫ్రెండ్, పోలీస్ చుట్టూ తిరుగుతుంది. వీళ్లు ముగ్గురూ రెండేసి జీవితాలు జీవిస్తుంటారు. తమలోని మరో కోణాన్ని వేరే వాళ్లకు తెలియనీయరు. అదే గమ్మత్తు. వీళ్ల ముగ్గురి మధ్య సంబంధం ఏంటనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్.

ఇక సెకండాఫ్ కు వచ్చేసరికి చాలా ఇష్యూస్ టచ్ చేశాడు దర్శకుడు. అప్పటివరకు ఎంటర్ టైనింగ్ గా సాగిన సినిమా, ద్వితీయార్థంలో కూడా అదే జోరు చూపిస్తుందనుకుంటే, దర్శకుడు మాత్రం ఎమోషన్, మెలొడ్రామాకు చోటిచ్చాడు. ఈ క్రమంలో కొన్ని సాగదీత సన్నివేశాలు పడినప్పటికీ, మరికొన్ని మంచి సీన్స్
కూడా పడ్డాయి. హీరో, అతడి భార్య మధ్య డ్రామాను అంత కన్విన్సింగ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. ఆ తర్వాతొచ్చే సన్నివేశాలు కూడా మందకొడిగా సాగుతాయి.

ఈ మైనస్ పాయింట్స్ సంగతి పక్కనపెడితే.. మూవీలో మంచి పెర్ఫార్మెన్సులున్నాయి. గాలిసంపత్ తో చిరాకు తెప్పించిన శ్రీవిష్ణు, ఈ సినిమాలో మాత్రం మెప్పించాడు. భర్తగా, దొంగగా, బాయ్ ఫ్రెండ్ గా అన్ని షేడ్స్ లో మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇక హీరోయిన్ సునైన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో భార్యగా, లా స్టూడెంట్ గా కనిపించిన సునైన బాగా చేసింది. ఎన్నో తమిళ సినిమాలు చేసిన అనుభవంతో, ఈ సినిమాలో అటు అందంతో పాటు, ఇటు నటనతో ఆకట్టుకుంది. హీరో లవర్ గా మేఘా ఆకాష్, పోలీస్ గా రవిబాబు ఆకట్టుకున్నారు. తన పాత్రలకు భిన్నంగా అజయ్ ఘోష్ సాఫ్ట్ క్యారెక్టర్ చేయగా.. గంగవ్వ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించుకుంటుంది. కొత్త దర్శకుడు హసిత్ గోలి, తన స్క్రీన్ ప్లేలో చమక్కులు చూపించాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా.. రాజ రాజ చోర సినిమాలో ఫన్నీ సీన్స్, ఎంటర్ టైనింగ్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. సెకెండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్ని మినహాయిస్తే.. ఓ మంచి ఎంటర్ టైనర్ అనిపించుకుంటుంది.

రేటింగ్: 3/5

Advertisement

This post was last modified on August 19, 2021 7:29 pm

Advertisement
Share