Advertisement
తెలుగు న్యూస్

శ్రీదేవి సోడా సెంటర్ – తెలుగు రివ్యూ

ముందు కథ అనుకుంటాం. అందులో ట్విస్టులు పెట్టడానికి ట్రై చేస్తాం. మరి ముందు ట్విస్టులు అనుకొని, ఆ తర్వాత కథ అల్లితే ఎలా ఉంటుంది? సరిగ్గా శ్రీదేవి సోడా సెంటర్ లా ఉంటుంది. ఈ సినిమాలో చివరాఖరి 15 నిమిషాల తప్ప మిగతాదంతా ఊహించేయొచ్చు. అలాగే ఉంది కూడా.

హీరో జైలు జీవితంలో సినిమా మొదలవుతుంది. అక్కడ్నుంచి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఇక్కడ్నుంచి స్టార్ట్ చేస్తే, చివరివరకు శ్రీదేవి సోడా సెంటర్ లో సీన్ బై సీన్ ఊహించేసుకోవచ్చు. మన ఊహకు తగ్గట్టే కథ నడుస్తుంటుంది. ఇక ఎక్సయిట్ మెంట్ కు స్కోప్ ఎక్కడుంది. చివరికి హీరోహీరోయిన్ల రొమాన్స్, సాంగ్స్ కూడా ఊహించుకోవచ్చు. ఇలాంటి దాంట్లో కథలో ట్విస్టుల కోసం చివరి వరకు వెయిట్ చేయాల్సిందే.

దర్శకుడు కరుణ కుమార్ తన మొదటి సినిమా ‘పలాస’లో చూపినట్లే కులం అనే అంశాన్ని పట్టుకున్నాడు.’తక్కువ కులం’ అని సమాజం భావించే వారి కథలను చెప్పాలనిపించే ప్రయత్నం మంచిదే. కానీ ‘పలాస’లో కనిపించిన ఎంతో కొంత ఒరిజినాలిటీ ఇందులో లేవు. ‘దొరసాని’, ‘సైరత్’, ‘ఉప్పెన’… ఇలా కులాలు, పరువు హత్యల్ని నేపథ్యంలో వచ్చిన సినిమాల్లోని పాయింట్లే మళ్ళీ చూపించాడు. ఈ సినిమాలో బలంగా చూపించింది మాత్రం ‘థర్డ్ యాక్ట్’ (చివరి ఘట్టం), ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రమే. ఈ 15 నిమిషాల ఎపిసోడ్ కోసం సినిమా అంతా భరించాలి. ఆ 15 నిమిషాలలో దర్శకుడు మాత్రం తనదైన మార్క్ చూపించగలిగాడు. “ఉప్పెన” తరహాలోనే “శ్రీదేవి సోడా సెంటర్” లో కూడా గోదావరి ప్రాంతంలోని నెగెటివ్ యాంగిల్ ను టచ్ చేశారు. కులాల మధ్య అంతరం, పేద-ధనిక మధ్య ఘర్షణని చూపించారు.

క్లైమాక్స్ ట్విస్ట్ టచ్ చేయకుండా సింపుల్ గా కథ చెప్పుకుందాం. అమలాపురంలో ఉండే సూరిబాబు (సుధీర్ బాబు) ఆ ఊరిలో మంచి ఎలక్ట్రీషియన్. ఎప్పటికైనా సిటీలో లైటింగ్ షాపు పెట్టాలనేది కోరిక. అందుకోసం డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. ఇక అదే ఊరిలో ఉండే కాశి( పవేల్ నవగీతన్)తో అనుకోకుండా సూరి బాబుకి గొడవ అవుతుంది. సూరిబాబు తనకి దొరక్కపోతాడా? అంటూ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటాడు కాశీ.

ఊళ్ళో జరిగే తిరనాళ్ళల్లో శ్రీదేవి సోడా సెంటర్ లో ఉండే శ్రీదేవి(ఆనంది)ని చూసి ప్రేమలో పడతాడు సూరిబాబు. శ్రీదేవి కూడా మెల్లగా సూరిబాబు ప్రేమలో పడుతుంది. ఇంతలో సూరిబాబు హత్య కేసులో జైలుకి వెళ్తాడు. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? చివరికి సూరిబాబు, శ్రీదేవి ఒకటయ్యారా లేదా అనేది కథ.

పెర్ఫార్మెన్సుల పరంగా చూసుకుంటే సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. అతడి యాస, బాడీ లాంగ్వేజ్ సూరిబాబు పాత్రకు సెట్ అయింది. అయితే ఈ కథకు, ఆ సిక్స్ ప్యాక్ బాడీకి లింక్ కుదరదు. హీరోయిన్ ఆనంది లుక్స్ కంటే యాక్టింగ్ తోనే బాగా ఆకట్టుకుంది. అయితే హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా మెప్పించిన వ్యక్తి మాత్రం సీనియర్ నరేష్. అతడి పాత్ర టోటల్ సినిమాకే హైలెట్. టెక్నికల్ గా మణిశర్మ తేలిపోయిన విషయాన్ని ముందే చెప్పుకున్నాం. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాను అంతోఇంతో నిలబెట్టింది.

ఓవరాల్ గా చూసుకుంటే.. పరువు హత్యలపై వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్, క్లైమాక్స్ తో మాత్రమే ఆకట్టుకుంటుంది. మిగతాదంతా గ్యాసే.

Rating: 2.25/5

Advertisement

This post was last modified on August 27, 2021 10:49 pm

Advertisement
Share