Advertisement
తెలుగు న్యూస్

వినాయక్ హిందీలో మెప్పించగలడా?

వి.వి.వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రదర్శకుడు. ఇప్పుడు రేస్ లో పూర్తిగా వెనుకబడ్డాడు. “అఖిల్”, “ఇంటెలిజెంట్” వంటి దారుణ పరాజయాలు వినాయక్ క్రేజ్ ని హుష్ కాకి చేశాయి. ఇప్పటికిప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలెవరూ ఆసక్తి చూపడం లేదు. అలాగే, వినాయక్ చేసిన “లూసిఫర్” రీమేక్ స్క్రిప్ట్ మార్పులకు చిరంజీవి కూడా ఒకే చెప్పలేదు.

దాంతో, వినాయక్ ఇప్పుడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో టెస్ట్ చేసుకుంటున్నాడు. “ఛత్రపతి” సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అది కూడా తన “అల్లుడు శీను” హీరో బెల్లంకొండ శీనుతో.

వినాయక్, రాజమౌళి… ఇద్దరూ అటుఇటుగా ఒకే టైంలో దర్శకులు అయ్యారు. ఐతే, రాజమౌళి కన్నా వినాయకేకి మొదట ఎక్కువ క్రేజ్ దక్కింది. “ఆది”, “ఠాగూర్” వంటి సంచలన విజయాలతో ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాకి కొత్త గ్రామర్ నేర్పాడు వినాయక్. 10 ఏళ్ళు అదే ఊపు కొనసాగించిన వినాయక్ … ఆ తరువాత రేసులో వెనుకబడ్డాడు. ఇప్పుడు రాజమౌళి నంబర్ వన్ డైరెక్టర్ గా నిలబడ్డాడు. అందుకే, వినాయక్ ఇప్పుడు రాజమౌళి పాత సినిమా కథని రీమేక్ చేస్తున్నాడు.

గోదావరి జిల్లాలకు చెందిని వినాయక్ కి హిందీ భాషపై పెద్దగా పట్టులేదు. కాకపోతే ఎమోషన్ పట్టుకోగలడు. మరి, పాత చింతకాయ పచ్చడిలాంటి కథతో నేటి తరం హిందీ ప్రేక్షకులను వినాయక్ మెప్పించగలడా అన్నది ప్రశ్న.

Advertisement

This post was last modified on November 27, 2020 5:56 pm

Advertisement
Share