
‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం ఈ సినిమాని #Mega158గా పిలుస్తున్నారు.
ప్రస్తుతం ఒక భారీ ఫైట్ సీన్ తీస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న ఈ ఫైట్ ఎపిసోడ్ లో వందలమంది ఫైటర్లు పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఘట్టంలో మెగాస్టార్ స్వయంగా పాల్గొంటున్నారట. సాధారణంగా ఇటీవల ఇలాంటి ఫైట్ సీన్లను డూపులతో కానిచ్చేస్తున్నారు పెద్ద హీరోలు. కానీ ఈ వయసులో కూడా చిరంజీవి సాహసోపేతమైన స్టంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వచ్చే నెల 22న ‘టైటిల్ టీజర్’ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.
ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీతం సమకూరుస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. అనశ్వర రాజన్ ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
