
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు నటీమణులను వెనుకవైపు నుంచి చిత్రీకరించే విధానాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
అవార్డు వేడుకలో ఫొటోగ్రాఫర్లు తన ఫొటోలు తీస్తుండగా, నేహా ధూపియా వారిని ఉద్దేశించి, “ఈ బ్యాక్ షాట్స్ ఎవరు తీస్తారు? ఇలాంటివి చేయొద్దు. నాతోనే కాదు, ఏ మహిళతోనూ ఇలా చేయకండి” అని స్పష్టంగా చెప్పారు.
ఇటీవల ఇదే అంశంపై పలువురు హీరోయిన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నటి మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్‌లు కూడా పాపరాజీ కోరినప్పటికీ వెనక్కి తిరిగి పోజులు ఇవ్వడానికి నిరాకరించారు. మరోవైపు, సమంత మాత్రం ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో పాపరాజీ కోసం వెనుకవైపు తిరిగి సంతోషంగా పోజులిచ్చింది.
అయితే సోనాక్షి సిన్హా, నేహా ధూపియా వంటి నటీమణులు మాత్రం మహిళలను వెనుకవైపు నుంచి చిత్రీకరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై బాలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.
ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నేహా ధూపియా ప్రస్తుతం పాడ్‌కాస్ట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల్లో కనిపిస్తున్నారు. తెలుగులో ఆమె “నీతో ఇష్టపడ్డాను” (2002), “విలన్” (2003), “పరమవీర చక్ర” (2011) చిత్రాల్లో నటించారు.
