
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న సమయంలో ఎదురైన ఒక వేధింపుల ఘటన గురించి మాట్లాడింది. ఆ సమయంలో తాను తీవ్ర ఆగ్రహంతో హింసాత్మకంగా ప్రవర్తించాల్సి వచ్చిందని, రోజురోజుకూ పెరిగిపోయిన నిరాశ, కోపం వల్లే అలా చేయాల్సి వచ్చిందని ఆమె అంగీకరించింది.
తన ఇంటికి దగ్గర్లో పదో తరగతి ట్యూషన్ క్లాసులకు వెళ్లేటప్పుడు కొందరు అబ్బాయిలు కాయదును వేధించేవారంట. మొదటి రోజు, రెండో రోజు వారి ప్రవర్తనను పట్టించుకోకుండా వదిలేశానని, కానీ మూడో రోజు మాత్రం వారి వేధింపులను అస్సలు భరించలేకపోయానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తీవ్ర కోపంతో ఊగిపోతూ, పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకుని వారిపైకి విసిరానని.. అది తగిలి ఒకరి తల పగిలిందని, ఆ తర్వాత భయంతో తాను అక్కడి నుంచి వచ్చేశానని బయటపెట్టింది కాయదు.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ. తన ప్రతిస్పందన చాలా తీవ్రమైనదే అయినప్పటికీ, ఆ సమయంలో తాను ఎంతలా అసహాయతను, ఆగ్రహాన్ని అనుభవించానో అది తెలియజేస్తుందని కాయాదు పేర్కొంది.
ఎవరినైనా రాయి విసిరి కొట్టడం కరెక్ట్ కాదని తనకు తెలుసని, కానీ అప్పుడు తనకు అనిపించింది తాను చేశానని అంటోంది.
పైకి చూడటానికి చాలా సైలెంట్‌గా కనిపించినప్పటికీ.. ఎవరైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోకూడదని, కచ్చితంగా తిరగబడాలని అంటోంది కాయదు. మహిళలు తమ జీవితాల్లో ఎదుర్కొనే వేధింపులను ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
