మను చరిత్ర – తెలుగు రివ్యూ

TeluguCinema 24 Jun 2023
Manu Charitra

“మను చరిత్ర” అంటే ఏదేదో ఊహించుకోవద్దు. మను అనే కుర్రాడి చరిత్ర ఇది. కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న అర్జున్ రెడ్డి, సూపర్ హిట్టయిన ఆర్ఎక్స్100 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. ఆ సినిమాల టైపులో “మను చరిత్ర”ను కూడా అగ్రెస్సివ్గా తీయాలనుకున్నాడు దర్శకుడు భరత్. కానీ భరించలేని విధంగా తీశాడు.

వరంగల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది. మను తెలివైన కుర్రాడు. కానీ ప్రేమలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్. తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిలకు, కొద్దిరోజులకే బ్రేకప్ చెబుతుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల మను పర్సనాలిటీ పూర్తిగా మారిపోతుంది. అతడు అలా మారడానికి కారణం ఏంటి? జెన్నిఫర్ (మేఘా ఆకాష్)ను ప్రేమించిన మను, ఆమెకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందనేది ఈ స్టోరీ.

ఈ స్టోరీకి కాస్త రౌడీయిజం, పాలిటిక్స్ కూడా యాడ్ చేశారు. ఎలాంటి ఆశయం లేని మను, రౌడీ షీటర్ రుద్ర గ్యాంగ్ లో చేరుతాడు. వరంగల్ మేయర్ హత్య కేసులో జైలుకు కూడా వెళ్తాడు. అతడు ఎందుకు రౌడీల గ్యాంగ్ లో చేరాడు.. నిజంగానే మేయర్ ను హత్య చేశాడా.. జాను పరిచయంతో అతడి జీవితం ఏ మలుపు తిరిగింది అనేది “మనుచరిత్ర”లో మరో థ్రెడ్.

ప్రేమ జీవితాన్ని నాశనం చేయలగదు, తిరిగి అదే ప్రేమ జీవితాన్ని నిలబెట్టగలదు అనే బలమైన పాయింట్ ను ఈ సినిమాలో చర్చించాడు దర్శకుడు. అయితే ఈ పాయింట్ కోసం అతడు రాసుకున్న సన్నివేశాలు, వాటిని తీసే విధానం ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం, హీరో బ్రేకప్ సన్నివేశాలతో సినిమా కాస్త ఫన్, ఎమోషనల్ గా సాగిపోతుంది. తను ప్రేమించిన అమ్మాయిలకు బ్రేకప్ చెప్పడానికి రీజన్ ఏంటనే విషయాన్ని రివీల్ చేసిన విధానం బాగుంది.

మేఘా ఆకాష్ తో హీరో లవ్ స్టోరీని బాగా పిక్చరైజ్ చేశారు. ఎప్పుడైతే సినిమా రౌడీయిజం, గ్యాంగ్ స్టర్ డ్రామాగా టర్న్ తీసుకుంటుందో అప్పుడే పట్టాలు తప్పుతుంది. దీనికితోడు సబ్-ప్లాట్ గా పెట్టిన పొలిటికల్ యాంగిల్ కథలో సింక్ అవ్వకపోగా, చిరాకు తెప్పిస్తుంది.

మనుగా శివ కందుకూరి బాగానే చేశాడు. అయితే అన్ని షేడ్స్ పండించలేకపోయాడు. జెన్నిఫర్ గా మేఘా ఆకాష్ మెప్పించింది. ప్రియ వడ్లమాని, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, డాలీ లాంటి మంచి నటులున్నప్పటికీ, ఎవ్వర్నీ సమర్థంగా వాడుకోలేకపోయాడు దర్శకుడు.

టెక్నికల్ గా కూడా సినిమా నీరసంగా ఉంది. ఒకట్రెండు పాటలు వినసొంపుగానే ఉన్నా గోపీసుందర్ సంగీతం దీనికి బలంగా నిలవలేదు. ఉన్నంతలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు గోపీసుందర్. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండడం, సెకండాఫ్ సాగతీతగా సాగడం మరో మైనస్.

ఓవరాల్ గా “మనుచరిత్ర” సినిమాను అంతసేపు భరించడం కష్టం.

Rating: 2/5

By: M Patnaik