‘పెద్ది’లోనూ ‘సామాన్’ ఉంది!

ఇటీవల సామాన్లు అనే పదం వాడి వివాదంలో ఇరుక్కున్నారు నటుడు శివాజీ. ఆ గొడవ ఇంకా సద్దుమణగలేదు. ఐతే, శివాజీ అలా అంటే యాగీ చేసిన వాళ్ళు “పెద్ది” సినిమాలో అదే పదం ఉంది కదా, దాని గురించి మాట్లాడారా అంటూ కొందరు కొత్త వివాదం మొదలుపెట్టారు.
“పెద్ది” సినిమా నుంచి వచ్చిన “చికిరి” అనే పాట బాగా వైరల్ అయింది. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట కారణంగా “పెద్ది”కి మరింత హైప్ పెరిగింది. ఈ పాటలో ఒక చోట హీరో.. హీరోయిన్ ని ఉద్దేశించి “సరుకు సామాన్” అంటాడు. పాటలో ఆ పదాలు ఉన్నాయి.
మొదట దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ తాజాగా శివాజీ చేసిన “సామాన్లు కప్పుకోవాలి” అనే కామెంట్ తో పెద్ది లిరిక్స్ పై ఫోకస్ పడింది.
ఈ పాటలో జాన్వీ కపూర్, రామ్ చరణ్ నటించారు. ఉత్తరాంధ్రలో ఒక తీపి పదార్థాన్ని చికిరి అని అంటారట. హీరో రామ్ చరణ్ అక్కడి ప్రాంతపు కథానాయకుడిగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. సో, ఆ యాసలో హీరో హీరోయిన్ జాన్వీ కపూర్ ని “చికిరి” అని పిలుస్తాడు. అలా పాటలో “ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ…పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా సరుకు సామాను సూసి” అని పాడుతాడు పెద్ది.
మరి హీరోయిన్ సరుకు సామాన్ గురించి హీరో మాట్లాడొచ్చా అని కొందరు వివాదం రేపుతున్నారు. మరి పెద్ది టీం దీని గురించి ఎలా స్పందిస్తోందో చూడాలి.