‘రచ్చ’ నటుడి వివరణ

ఒక మహిళతో తాను అనుచితంగా మాట్లాడినట్లు వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ వివాదంపై స్పందించారు నటుడు అజ్మల్ అమీర్. ఆ ఆడియో క్లిప్ లో అజ్మల్ ఒక ఆవిడతో అసభ్యంగా మాట్లాడాడు. దాంతో అతని ప్రవర్తన గురించి ఆరోపణలు వెల్లువెత్తాయి. అమ్మాయిలను లైంగికంగా వేధిస్తాడనే మాట బయటికి వచ్చింది.
దాంతో, అజ్మల్ అమీర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా విడియో మెసేజ్ షేర్ చేశాడు. “ఏఐ ఉపయోగించి నా గొంతును అనుకరించి వీడియోలు, ఆడియోలు షేర్ చేస్తే నా కెరీర్ ఖతం అవుతుంది అనుకుంటే భ్రమ,” అని పేర్కొన్నాడు.
ఆ ఆడియో తనది కాదని స్పష్టం చేశాడు.
“ఈ క్లిప్ వివాదం తర్వాత నాకు చాలా మంచి జరిగింది. నాకు మద్దతుగా అనేక మంది ఫోన్ చేశారు. మెసేజ్ పెట్టారు. నా బలం ఏంటో నాకు తెలిసి వచ్చింది. నన్ను బద్నామ్ చెయ్యాలనే కుట్రతో ఇలాంటి ఆడియో వదిలారని అందరికీ అర్థమైంది,” అని అన్నాడు.
“రంగం” సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు అజ్మల్. అందులో విలన్ గా నటించాడు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన “రచ్చ”లో కూడా విలన్ పాత్ర పోషించాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన రాజకీయ చిత్రాలు “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”, “వ్యూహం” వంటివి చేశాడు. అలాగే పాయల్ రాజపుత్ నటించిన “మంగళవారం”లో కూడా కీలక పాత్రలో కనిపించాడు.