ధనుష్ కి ‘ఇడ్లీ’ ట్రోలింగ్

TeluguCinema 16 Sep 2025
Idly Kadai

ధనుష్ తండ్రి కస్తూరి రాజా దర్శక, నిర్మాత. ఆయన దర్శకుడు కాకముందు అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా ఉన్నారు. అంటే 1980ల నుంచి ధనుష్ కుటుంబం సినిమా రంగంలో ఉంది. ధనుష్ 1983లో పుట్టాడు. కానీ తాను చిన్నప్పుడు ఇడ్లీ కొనుక్కునేందుకు ఇబ్బందులు పడేవాడిని అని, ఇడ్లీకి కూడా డబ్బులు ఉండేవి కావని ఇటీవల చెప్పాడు ధనుష్.

దాంతో అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

“నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తమిళనాడులో ఇడ్లీ ధర రూపాయి ఉండేదేమో. మీ నాన్న సినిమా ఇండస్ట్రీలో పని చేస్తూ నీకు రూపాయి పెట్టి ఇడ్లీ కొనివ్వలేదా. మరి మేం అంతలా కనిపిస్తున్నామా,” అంటూ ధనుష్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ధనుష్ నటించి, డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం… ఇడ్లీ కడాయి (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’). ఇది అక్టోబర్1న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్ లో తాజాగా ధనుష్ తన చిన్నప్పటి కష్టాలు, తనకు ఇడ్లీ అంటే ఎంతో ఇష్టమో వివరించాడు. చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేది కానీ చేతిలో కొనేందుకు డబ్బులు ఉండేవి కావని తెలిపాడు.

అందుకే, ధనుష్ “పేదపలుకులు” గురించి వెటకారం చేస్తున్నారు. ఫేమస్ అయిన తర్వాత ప్రతి సెలెబ్రిటీ ఇలాంటి పేద ముచ్చట్లు చెప్తాడు అని అంటున్నారు. ఇడ్లీ కొనుక్కొని తినలేని కుటుంబం నుంచి ధనుష్ వచ్చాడంటే నమ్మలేంలే, మీ తండ్రి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడని మాకు తెలుసులే అంటూ ధనుష్ ని ట్రోల్ చేస్తున్నారు.