చచ్చిపోతా విషమివ్వండి: దర్శన్

TeluguCinema 10 Sep 2025
Darshan

మళ్లీ జైళ్లోకి వెళ్లిన కన్నడ హీరో దర్శన్ సంచలన ప్రకటన చేశాడు. తను చచ్చిపోతానని, కాస్త విషమివ్వాలని నేరుగా జడ్జికే విన్నవించుకున్నాడు. పరప్పన అగ్రహార జైలు దర్శన్ కు చుక్కలు చూపిస్తోంది. దాని ఫలితమే ఈ స్టేట్ మెంట్.

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రిమాండ్ లో ఉన్న దర్శన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరయ్యాడు. జైలులో సూర్యరశ్మి తగలడం లేదని, ఎండ చూసి చాన్నాళ్లయిందని వాపోయాడు. తన దుస్తులు కంపు కొడుతున్నాయని, జైళ్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని అన్నాడు.

ఈ జైలులో ఉండడం కంటే తనకు విషమిస్తే తాగి సంతోషంగా మరణిస్తానని జడ్జికి విన్నవించుకున్నాడు. జైలులో ఫంగస్ తనను చాలా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

నిజానికి ఈ కేసులో దర్శన్ కు బెయిల్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో సవాల్ చేసి బెయిల్ రద్దయ్యేలా చేసింది. దీంతో తిరిగి జైలు జీవితం మొదలుపెట్టాడు దర్శన్. రెండో దఫా జైలు జీవితం ప్రారంభించిన ఈ నటుడు, ఇప్పుడిలా జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తొలి దఫా జైలులో ఉన్నప్పుడు దర్శన్ కు ఇచ్చిన కొన్ని ప్రత్యేక సౌకర్యాల్ని, వసతుల్ని.. సుప్రీం ఆదేశాలతో ఈ దఫా తొలిగించారు.