
పీపుల్స్ స్టార్ అనిపించుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. సినిమావాళ్ళకు భిన్నమైన వ్యక్తి… నారాయణమూర్తి. ఇప్పటికీ ఆయనకి కారు లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా నడక, లేదా ఆటోని ఆశ్రయిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న నటుడు ఆయన. ఒకప్పుడు ఆయన సినిమాలు కోట్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు ఆయన సినిమాలు ఆడడం లేదు. దాంతో, ఆయన ఇప్పుడు కడు పేదరికంలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కానీ అవన్నీ అబద్దాలు అని తోసిపుచ్చారు ఆర్. నారాయణమూర్తి. ఆయన ఇంటికి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారని అంటూ జరుగుతున్న ప్రచారం అబద్దమే.
“హైదరాబాద్ సిటీలో నేను ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాను అని గద్దర్ అన్నారు. ఆయన ఉద్దేశం వేరు. ఆయన చెప్పిన మాటలను వక్రీకరించారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం నాకు ఇష్టం. అందుకే సిటికి దూరంగా ఉంటున్నాను. సిటీ అవతల నుంచి రోజు సిటీకి ఆటోలో వస్తాను. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, నెలకు 30 వేలు ఆటోకి ఖర్చు పెడుతున్న వాణ్ని… ఇంటి అద్దె కట్టుకోలేనా? కాబట్టి దయచేసి నా ఆర్థిక స్థితి గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు,” అని ఆర్ నారాయణమూర్తి అన్నారు.
“సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. కోట్లు సంపాదించాను. నా వరకు సరిపడా దాచుకున్నా. మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చాను,” అని వివరణ ఇచ్చారు.