వెంకీ ఐడియా చిరంజీవిదే

TeluguCinema 08 Dec 2025
Mana Shankara Vara Prasad Garu: Venkatesh wraps his part

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం… మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఐతే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక పాత్రలో కనిపిస్తారు. అలా వచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదు సినిమాలో ఆయనది కీలక పాత్ర.

“నిజానికి వెంకటేష్ ని తీసుకోవాలని నేను అనుకోలేదు. స్క్రిప్ట్ మొత్తం ప్రిపేర్ చేశాక, చిరంజీవి గారే వెంకటేష్ పాత్రకి సంబంధించి ఐడియా ఇచ్చారు. అలా ఆయనని అప్రోచ్ అయ్యాం. వెంకటేష్ పాత్ర సినిమాలో 20 నిమిషాల పాటే ఉంటుంది, “అని దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా తెలిపారు.

అనిల్ రావిపూడి వెంకటేష్ తో ఇప్పటికే “ఎఫ్ 2”, “ఎఫ్ 3”, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలు చేశారు. ఇప్పుడు నాలుగోసారి వెంకటేష్ అయన డైరెక్షన్లో నటిస్తున్నారు.

“సినిమా చివరి అరగంటలో వెంకటేష్, చిరంజీవి గారి ఎపిసోడ్ అదిరిపోతుంది. ఇద్దరి మధ్య భారీ ఎపిసోడ్, ఒక పాట, ఒక ఫైట్ ఉంది,” అని దర్శకుడు వివరించారు.

“మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది.