
జాన్వీ కపూర్ వరుసగా సినిమాలు విడుదల చేస్తోంది. మొన్నామధ్య “పరమ్ సుందరి”గా వచ్చింది. గత వారం “హోమ్ బౌండ్” సినిమా విడుదల చేసింది. ఇక వచ్చే వీకెండ్ అంటే అక్టోబర్ 2న “సన్నీ సంస్కారి కీ తులసి కుమారి” (Sunny Sanskari ki Tulsi Kumari) థియేటర్లలోకి రానుంది.
ఐతే జాన్వీ కపూర్ నటించిన సినిమాలు వరుసగా వస్తున్నా ఆమెకి సొంతంగా జనాలని రప్పించేంత క్రేజ్ లేదు హిందీ మార్కెట్ లో. అందుకే, ఈ కొత్త సినిమా “సన్నీ సంస్కారి కీ తులసి కుమారి”కి సరైన థియేటర్లు కూడా దొరకడం లేదు. ఎందుకంటే అదే రోజు “కాంతార: చాప్టర్ 1” విడుదల అవుతోంది. హిందీ మార్కెట్ లో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ లు అత్యధికంగా ఆ సినిమాకే ఇస్తున్నారట. దాంతో జాన్వీ కపూర్ చిత్రానికి తక్కువ షోలు, తక్కువ స్క్రీన్ లు మాత్రం లభించాయి.
దాంతో ఈ సినిమా నిర్మాత కరణ్ జోహర్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు. వరుణ్ ధావన్ లాంటి హిందీ హీరో, జాన్వీ కపూర్ లాంటి గ్లామర్ హీరోయిన్ జంటగా నటించిన హిందీ సినిమాకి హిందీ రాష్ట్రాల్లో థియేటర్లు ఇవ్వరా అంటూ ఆయన వాదిస్తున్నారు. “కాంతార చాప్టర్ 1 సినిమాకి క్రేజ్ ఉంటుంది అని నేను ఒప్పుకుంటాను కానీ మా సినిమా స్టార్స్ కూడా తక్కువేమి కాదు. కనీస స్థాయిలో మంచి థియేటర్లు ఇవ్వాలి కదా,” అని ఆయన అడుగుతున్నారు.
పాపం జాన్వీ కపూర్. వరుసగా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆమె తెగ ప్రచారం చేస్తోంది. కానీ ఆమె సినిమాలకు సరైన ఓపెనింగ్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు.





