
ఈ మధ్య కాలంలో సినిమాల ఎంపికలో, పాత్రల పరంగా చాలా వైవిధ్యం చూపుతున్న ఇండియన్ హీరో … ఫహద్ ఫాజిల్. ఆయన నటించిన తాజా చిత్రం …”మాలిక్”. ఫహద్ త్వరలోనే తెలుగు ప్రేకక్షకులకు కూడా పరిచయం కానున్నారు సుకుమార్ తీస్తున్న “పుష్ప” సినిమాతో. “మాలిక్” ఈ రోజు (జులై 15) అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైంది.
కథ పాతదే. కానీ దర్శకుడు మహేష్ నారాయణన్ మేకింగ్ పరంగా తన సత్తా చాటారు. కొప్పోలా తీసిన మూడు ‘గాడ్ ఫాథర్’ చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. అలాగే మణిరత్నం తీసిన ‘నాయకుడు’ నుంచి అనేక సన్నివేశాలు తీసుకున్నారు. ఫార్ములా పాతదే… కానీ దర్శకుడు కేరళ రాజకీయ, సామాజిక, మతపరమైన అంశాలను జోడించి డ్రామా పండించారు. ఐతే, ఈ సినిమా చూడడానికి చాలా ఓపిక కావాలి. స్లోగా నడవడం ఒక కారణం. మరో సమస్య 2 గంటల 45 నిమిషాల లెంగ్త్. దర్శకుడు మహేష్ నారాయణన్ స్వతహాగా ఎడిటర్. అయినా…. లెంగ్త్, పేసింగ్ విషయంలో జాగ్రత్త పడలేదు.
ఈ సమస్యలున్నా… విజిల్ వెయ్యాలనిపించే ఫహద్ ఫాజిల్ యాక్టింగ్, హీరోయిన్ నిమిష మరింత అద్భుతమైన అభినయం ఈ సినిమాని రక్తికట్టించాయి. మొదటి గంట కన్నా చివరి గంట, ముఖ్యంగా క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్.
ఈ సినిమా కథ మూడు ఫ్లాష్ బ్యాక్ ల్లో నడుస్తుంది. వయసైపోయిన డాన్ సులేమాన్ (ఫహద్ ఫాజిల్) ఇక దేవుడికి నచ్చని పనులు చేయకూడదని నిర్ణయించుకొని హజ్ యాత్రకి బయలుదేరుతాడు. ఎయిర్పోర్ట్ లో టాడా చట్టం కింద అతన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. 14 రోజుల రిమాండ్లో ఉన్న అతన్ని విడిపించేందుకు ఆయన భార్య రోజిలిన్ (నిమిష) ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక, స్కూల్ పై బాంబ్ వేసిన కేసులో ఫ్రెడ్డీ అనే యువకుడిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అతను కూడా ఆ ఘటనలో గాయపడుతాడు. అతనికి జైలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు పోలీసులు. ఫ్రెడ్డీ ఎవరో కాదు రోజ్లిన్ సొంత అన్న డేవిడ్ కొడుకు. డేవిడ్, సులేమాన్ ఒకప్పుడు స్నేహితులు. కానీ చెప్పుడు మాటలతో డేవిడ్ సులేమాన్ పై కక్ష పెంచుకుంటాడు. ఆ తర్వాత పోలీసుల, రాజకీయనాయకుల చేతిలో పావుగా మారుతాడు.
ఫ్రెడ్డీని ఉపయోగించి సులేమాన్ ని జైలులోనే లేపెయ్యలయాలనేది ప్రభుత్వం ప్లాన్. ఇంతకీ… ఈ సులేమాన్ ఎవరు? ఎందుకు, ఎలా డాన్ అయ్యాడు? డేవిడ్, సులేమాన్ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి అనేది సినిమా కథ. ఈ కథని సులేమాన్ తల్లి, డేవిడ్, సులేమాన్ … ఫ్రెడ్డీకి చెప్పే ఫ్లాష్ బ్యాక్ ల ద్వారా మనకు చెప్తారు.
కేరళలో క్రిస్టియన్, ముస్లిం వర్గాల మధ్య గొడవలు, తీరప్రాంతమైన కేరళ తరుచుగా ఎదుర్కొనే వరద సమస్యలు, హైవే ప్రాజెక్ట్ ల కోసం కేరళ రాజకీయనాయకులు ఆడే డ్రామాలు, పర్యావరణ సమస్యలు వంటివి కూడా ఇందులో అండర్ కరెంట్ గా చూపించారు దర్శకుడు.
సినిమా మొదటి 12 నిమిషాల్లో ఒక్క కట్ కూడా ఉండదు. ఈ చిత్రీకరణ సూపర్ గా ఉంది. అలాగే చివర్లో వచ్చి షూట్ అవుట్ తీసిన విధానం, జైల్లో సులేమాన్ (ఫహద్ ఫాజిల్), ఫ్రెడ్డీ మధ్య సన్నివేశాలు, ట్విస్ట్ ఈ సినిమాకి బలం.
గాడ్ ఫాథర్, నాయకుడు చిత్రాల ప్రభావం అధికంగా ఉన్నా కూడా ఈ సినిమా ప్రారంభించి, ముగించిన విధానం బాగుంది.