
భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త రికార్డు నమోదు అయింది. గత నాలుగు రోజుల్లో నాలుగు సినిమాలు కలిపి ఏకంగా 390 కోట్లు కొల్లగొట్టాయి. జైలర్, గదర్ 2, OMG2, భోళా శంకర్… ఈ నాలుగు చిత్రాలు గత వీకెండ్ విడుదలయ్యాయి. ఇందులో “జైలర్” “గదర్ 2” సంచలన విజయాలు నమోదు చేశాయి. అక్షయ్ కుమార్ నటించిన OMG2 కూడా మంచి వసూళ్లు అందుకొంది. “భోళాశంకర్” మాత్రం మొదటి రోజు తర్వాత చతికలాపడింది. అయినా… ఈ నాలుగు చిత్రాలతో ఇండియాలోని థియేటర్లు అన్నీ కళకళలాడాయి.
ఈ నాలుగు చిత్రాలకు కలిపి దేశంలోని అన్ని మల్టీప్లెక్స్ లు, థియేటర్లలో వచ్చిన ఆదాయం అక్షరాలా 390 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో కేవలం ఒక్క వెకెండ్ లో ఇంత భారీ మొత్తం ఎప్పుడూ వసూలు కాలేదంట. “బాహుబలి 2″, కేజీఎఫ్”, “పఠాన్” విడుదలైనప్పుడు కూడా మొదటి వీకెండ్ వసూళ్లు ఈ రేంజ్ లో లేవు.
ఐతే, ఇంత భారీ మొత్తం వసూళ్ళలో సింహభాగం జైలర్, గదర్ 2 చిత్రాలదే.
సన్నీ డియోల్ నటించిన “గదర్ 2 ” నార్త్ ఇండియాలో ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో (శుక్ర, శని, ఆది) ఏకంగా 132 కోట్లు కొల్లగొట్టింది. ఇక జైలర్ సంగతి సరేసరి.
“జైలర్” తెలుగులో 22 (నెట్) కోట్లు కొల్లగొట్టగా మరో 100 (నెట్) కోట్లు తమిళ వర్షన్ కి వచ్చాయి.