ఆమె కోసం పాట రాయలేదు: రామ్

హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ నటించిన “ఆంధ్రా కింగ్ తాలూకా” సినిమా ఎల్లుండి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అనే మాట వినిపించింది. ఇక మొదటి పాట విడుదలై బాగా వైరల్ అయ్యాక వీరి డేటింగ్ గురించి పుకార్లు బలంగా వినిపించాయి.
ఇప్పుడు సినిమా విడుదల సందర్భంగా అటు భాగ్యశ్రీ, ఇటు రామ్ డేటింగ్ గురించి ప్రశ్నలు ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పటికే భాగ్యశ్రీ అలాంటిదేమి లేదని చెప్పింది. ఇప్పుడు రామ్ కూడా స్పందించాడు.
“నేను ఈ సినిమాలో రాసిన పాట ఆమె కోసమే అని చాలా మంది భావించారు. అందుకే ఈ పుకారు వచ్చింది. కానీ నేను పాట రాసే టైంకి భాగ్యశ్రీ ఈ సినిమా సైన్ కూడా చెయ్యలేదు. ఆమె కోసమే రాసి ఉంటాను అని జనాలు ఊహించుకున్నారు,” అని రామ్ క్లారిటీ ఇచ్చాడు.
ఐతే, డేటింగ్ లేదని మాత్రం కరాఖండిగానూ చెప్పడం లేదు. వీరి మధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అయిందన్న పుకారు మాత్రం సినిమాకి బాగా హెల్ప్ చేసింది. ఈ సినిమాకి బాగా బజ్ రావడానికి అదొక కారణం.
“ఆంధ్రా కింగ్ తాలూకా” ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు మొదలయ్యాయి.