ఊర మాస్ వల్ల లాభముందా?

TeluguCinema 13 Aug 2025
Mass Jathara

రవితేజకి ఇప్పుడు నిజంగా ఒక భారీ హిట్ కావాలి. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్.. ఇలా వరుసగా ఫ్లాపులు ఉన్నాయి. ఆయన కెరీర్ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. రవన్న అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు రవితేజని.

ఇప్పుడు ట్విట్టర్లో రావన్న..ఇది మా విన్నపం అంటూ పోస్టులు పెడుతున్నారు. “మాస్ జాతర” సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటలు, టీజర్ మరీ ఊర మాస్ పద్దతిలో ఉన్నాయి. మాస్ మహారాజా అనే బిరుదు ఉన్న రవితేజ నుంచి మాస్ సినిమాలే అభిమానులు కోరుకుంటారు. కానీ మరీ ఇంతా ఊర మాస్ అవసరమా అని వాళ్ళే ప్రశ్నలు వేస్తున్నారు.

“ఇప్పుడు మనకి హిట్ అవసరం అన్నా. మరీ ఇంతా ఊర మాస్ అయితే జనం వస్తారా?” అని వాళ్ళు డౌట్స్ వేస్తున్నారు.

ఐతే కథనంలో దమ్ముంటే బోయపాటి సినిమానే హిట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. ఇటీవల అనేక యాక్షన్ చిత్రాలు ఊర మాస్ తోనే హిట్ అయ్యాయి. రవితేజ అదే భావనతో ఉన్నాడు. ఖాకీ డ్రెస్సులో సినిమా చేస్తే తనకి హిట్ వస్తుందనే సెంటిమెంట్ రవితేజకి ఉంది. ఈ సినిమాలో అదే పాత్ర.

పైగా శ్రీలీలతో ఆ మాత్రం మాస్ ఉండాలి తనకు అని రవితేజ అనుకుంటున్నట్లు ఉన్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన “ధమాకా” అలాగే ఆడింది.