ఫ్యాన్స్ ప్రేమకు లాజిక్ ఉండదు: ఉపేంద్ర

TeluguCinema 25 Nov 2025
Upendra

“ఆంధ్ర కింగ్ తాలూకా” నవంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ ఒక సినిమా హీరో అభిమానిగా నటిస్తున్నాడు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఒక మూవీ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఉపేంద్ర చెప్పిన ముచ్చట్లు…

“ఆంధ్ర కింగ్ తాలూకా” కథ గురించి, మీ పాత్ర గురించి చెప్పండి?

ఈ కథలో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. అసలు అభిమానుల ప్రేమకు లాజిక్ ఉండదు. ఒక సినిమా హీరోగా మేం అంత ప్రేమకు అర్హులమేనా అనిపిపిస్తుంటుంది. ఆ పాయింట్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నేను ఒక సూపర్ స్టార్. ఒక స్టార్ కి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్ ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒక్కొక్క డైలాగ్ మనసును హత్తుకునే లాగా ఉంది. ఇలాంటి మంచి సినిమా చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ చెప్పాలి. ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది.

చిన్నప్పుడు సినిమా చూడటం పెద్ద విషయం. ఏడాదికి ఒకసారి వెళ్ళడమే గొప్ప. నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత రజనీకాంత్ గారు, చిరంజీవి గారి సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడిని. నాగార్జున గారి శివ సినిమా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. ఇప్పుడు హీరో అయ్యాను. సినిమాలు థియేటర్లలోకి వెళ్లడం చూడడం లేదు.

హీరో రామ్ తో నటించడం ఎలా ఉంది?

రామ్ మంచి ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన యాక్షన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీన్ మీరు చూసినప్పుడే మీరే చెప్తారు. ఆయన రియల్ గా ఒక ఫ్యాన్ లాగా నటించారు. ఒక స్టార్ అయి ఉండి అలా నటించడం అంత ఈజీ కాదు. ఒక అభిమానిలో ఉండే అమాయకత్వం ఎనర్జీ మాస్ అన్ని అద్భుతంగా కనిపించాయి.

మీ డైరెక్షన్లో కొత్త సినిమా?

కొన్ని కథల మీద వర్క్ జరుగుతుంది.

ఇటీవల రజినీకాంత్ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?

నా జీవితంలో ఒక మర్చిపోలేని సన్నివేశం అది. రజినీకాంత్ గారికి నేనొక భక్తుడిని. నేను ఆయన్ని ఒక డిక్షనరీలాగా ఫాలో అవుతాను. ఆయన అంటే నాకు అంత కనెక్షన్. చిరంజీవి గారిని డైరెక్ట్ చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది కూడా నెరవేరుతుందేమో చూడాలి.