సుశాంత్ సింగ్ మరణం: ఏడాది తర్వాత…!

Sushanth


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి నేటికి ఏడాది. జూన్ 14, 2020… భారతీయ సినిమా పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనయిన రోజు. సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి సుశాంత్ మరణ వార్త బిగ్ షాక్.

జూన్ 14న ఏమి జరిగింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆయన మరణం వెనుక ఉన్న ‘అసలు’ కారణాలు ఇప్పటికీ బయటికి రాలేదు. మొదట ఆత్మహత్య అని, ఆ తర్వాత హత్య అని… ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఏడాది తర్వాత కూడా అసలు విషయమేంటో ఇంకా పూర్తిగా తేలలేదు. సీబీఐ చేపట్టిన విచారణ ఇంకా కొలిక్కి రాలేదు.

ఈ ఏడాది గ్యాప్ లో సుశాంత్ సింగ్ మరణం పేరు చెప్పి చాలా రాజకీయం మాత్రం నడిచింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం చాలా హడావిడి చేశాయి ఈ కేసులో. కానీ చివరికి వెనక్కి తగ్గాయి.

సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి అసలు సూత్రధారి అని చాలా గగ్గోలు పెట్టాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు… ఎంతో హంగామా చేసి ఇప్పటివరకు ఏమి తేల్చలేకపోయారు. రియాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా చేశారు. ఐతే, కోర్టు ఆమెకి రెండు నెలల తర్వాత బెయిల్ ఇచ్చింది.

సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా అనుమానాస్పదంగానే ఉందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ ఊసు కూడా లేదు.

ఏడాది తర్వాత సుశాంత్ సింగ్ మరణం మిగిల్చిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఎప్పటికైనా సమాధానాలు దక్కుతాయా అన్నది అనుమానమే.

 

More

Related Stories