ధనుష్ కాపురంలో చిచ్చు పెట్టిందెవరు?

మొన్న నాగ చైతన్య – సమంత విడాకుల విషయం దక్షణాది చిత్రసీమని విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల ప్రకటన కూడా అంతే షాక్ నిచ్చింది.
సంక్రాంతి 2022 పండుగ ముగిసిన వెంటనే ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నాగ చైతన్య, సమంతల్లాగే ఇద్దరూ ఒకే తీరు ప్రకటన చేశారు. చైతన్యది పేరొందిన అక్కినేని సినిమా కుటుంబం. ఐశ్వర్య ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. ఇండస్ట్రీ ఫ్యామిలీస్ లో ఇలా వరుస విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
2004 నవంబర్ లో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఐశ్వర్య కూడా డైరెక్టర్. ఐతే, వీరి మధ్య సమస్య ఇప్పుడే మొదలు కాలేదు. 2013లోనే వీరు విడిపోతున్నారు అని వార్తలు గుప్పుమన్నాయి. ఒక హీరోయిన్ తో ధనుష్ చనువుగా ఉండడమే కారణం అని అప్పట్లో తమిళ, బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.
ఐతే, ఆ తర్వాత వీరి మధ్య అంతా సర్దుకున్నట్లు అనిపించింది. మొన్నామధ్య రజినీకాంత్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్తే అక్కడికి ధనుష్ కూడా వెళ్లి దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. ఇది జరిగి మూడు నెలలు కూడా కాలేదు. కానీ ఇప్పుడు విడిపోతున్నారు ధనుష్, ఐశ్వర్య. వీరి కాపురంలో చిచ్చు పెట్టిన ఆ మూడో వ్యక్తి ఎవరు అనే దానిపైనే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.