ఎక్కడో చూసిన జ్ఞాపకం!

రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయన తీసే చిత్రాలు, ఆయన ఇచ్చే హిట్స్ మామూలుగా ఉండవు. ప్రతి సినిమా రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఆయన మహేష్ బాబు హీరోగా భారీ చిత్రం తీస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ మొదటి లుక్ విడుదలైంది. “కుంభ” అనే పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తారు ఇందులో. ఈ పోస్టర్ లో పృథ్వీరాజ్ వీల్ చైర్ లో కూర్చున్నారు. కాలు వంకర పోవడం, చేతులు వంకర్లు తిరిగి ఉన్న పృథ్వీరాజ్ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ .రాజమౌళి టచ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించారని అంటున్నారు.
ఐతే మరికొందరు మాత్రం ఇది మార్వెల్ సినిమాల్లో ప్రొఫెసర్ X పాత్ర లుక్ ని కాపీ కొట్టినట్లు ఉంది అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీపెన్ హాకింగ్ లా పృథ్వీరాజ్ కనిపిస్తున్నారు అని అంటున్నారు. “క్రిష్ 3” సినిమాలో వివేక్ ఒబెరాయ్ కూడా ఇలాగే ఉంది అని గుర్తు చేస్తున్నారు.
మరికొందరు ఏమో ‘స్పైడర్ మేన్ 3’ సినిమాలో డాక్టర్ ఆక్టోపస్ తనకు వీపు పైన తగిలించిన మెటల్ వైర్లును తీసుకొచ్చి పృథ్వీరాజ్ కి పెట్టారా అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అలాగే సూర్య నటించిన “24” సినిమాలోని ఓ పాత్రని కూడా గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి ఈ పోస్టర్ మిశ్రమ స్పందన తెచ్చింది.
ఇక ఈ సినిమా పేరు, మొదటి వీడియోని నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే భారీ ఈవెంట్ లో విడుదల చేస్తారు.