‘అఖండ 2’ కథ తెలియదు: ఆది

TeluguCinema 29 Nov 2025
Aadhi Pinishetty

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం “అఖండ 2”. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించారు. ఇంతకుముందు బోయపాటి డైరెక్షన్లోనే ఆది “సరైనోడు” చిత్రంలో విలన్ గా కనిపించారు. ఇప్పుడు మళ్లీ బోయపాటి సినిమా చేశారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు ఆది తెలిపారు.

కథ వినకుండా ఒప్పుకున్నా!

బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను ‘సరైనోడు’ చిత్రంలో వైరం ధనుష్ అనే పాత్రను పోషించాను. అందులోని పాత్రకి ‘అఖండ 2’లో నేను పోషించిన కారెక్టర్‌కు చాలా తేడా ఉంటుంది. ఇలాంటి పాత్రను పోషించడం నాకు కూడా కొత్తే. మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్రలు నేను చేయలేదు. నేను కథ వినకుండా ఓకే చేసిన మొదటి చిత్రం ‘అఖండ 2’. బోయపాటి గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన సత్తా ఏంటో నాకు తెలుసు. బాలయ్య గారికి ఎదురుగా అంటే సరిపోతానా? అని అడిగాను. పర్‌ఫెక్ట్‌గా ఉంటారు అని ఆయన అన్నారు. సెట్‌కి వెళ్లిన తరువాతే నాకు ఆ వాతావరణం, కథ తెలిసింది.

కొత్త పాత్ర… కొత్త ప్రయోగం

బోయపాటి గారు నా పాత్రను వివరించిన తరువాత చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. వైరం ధనుష్ లాంటి పాత్రలు అయితే సొంతంగా ఊహించుకుని చేసుకోవచ్చు. కానీ ఇందులో పోషించిన పాత్ర మాత్రం నాకు ఓ ప్రయోగం లాంటిదే. ఇందులోని ప్రతీ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బోయపాటి గారు నాకు ముందే కొన్ని రిఫరెన్స్‌లు ఇచ్చారు. ఇలానే ఉండాలి.. ఇలానే కనిపించాలి.. ఇలానే ప్రవర్తించాలి అని ఆయన ముందే చెప్పారు. చాలా లుక్ టెస్ట్‌‌ల తరువాత ఫైనల్‌గా ఇప్పుడు సినిమాలో మీరు చూస్తున్న లుక్ ఫైనల్ అయింది.

సెట్ లో బాలయ్య వేరు!

బాలయ్య గారి గురించి బయట చాలా వింటుంటాం. కానీ సెట్‌లో ఆయన ఎనర్జీ వేరేలా ఉంటుంది. ఆయన ఉంటే సెట్‌లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. మా నాన్న గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ని కూడా నాతో పంచుకున్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం.

‘అఖండ’ కంటే ‘అఖండ తాండవం’లో హై మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బాలయ్య యాక్షన్, బోయపాటి మేకింగ్, తమన్ మ్యూజిక్, ఎలివేషన్స్‌ని చూస్తే పదివేల వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. వావ్ అనిపించేలా, ఆశ్చర్యపోయేలా ఎన్నో అంశాల్ని చూపించబోతోన్నారు. అదే ‘అఖండ 2’ ప్లస్ పాయింట్.

కొత్త సినిమాలు

‘థండర్’ అనే స్పోర్ట్స్ డ్రామాని తమిళ, తెలుగు భాషల్లో చేస్తున్నాను. ‘మరకతమణి’ సీక్వెల్ చేస్తున్నాను. కార్తీతో కలిసి ‘మార్షల్’ మూవీని కూడా చేస్తున్నాను.