నిర్మాతల తప్పులే ఎక్కువ!

TeluguCinema 05 Dec 2025
Akhanda 2 in 3D

అఖండ-2 ప్రీమియర్ షో రద్దు అని నిర్మాతల నుంచి ప్రకటన రాగానే బాలకృష్ణ అభిమానులు ఉసూరుమన్నారు. తమ స్టార్ సినిమాకు భారీ హంగామా చేద్దామనుకున్నవాళ్లు కాస్తా నిరాశపడ్డారు. శుక్రవారం రిలీజ్ షో దగ్గర హడావిడి చేద్దామనుకున్నారు. ఆ తరవాత రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అన్నారు. ఇక అభిమానుల్లో ఆగ్రహం తాండవం చేస్తోంది… సోషల్ మీడియాలో.

ఇక్కడ తప్పంతా నిర్మాతలదే. సినిమా విడుదలకు ఆర్థికపరమైన అడ్డంకులు వస్తాయని తెలిసీ రిలీజ్ డేట్ వేయడం, ప్రీమియర్ షోలకు అనుమతులు తెచ్చుకోవడం సినీ వర్గాలకు అర్థం కానీ విషయం. ప్రీమియర్ షోలు రద్దు అనే ప్రకంత రావడానికి గంట ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు.

అసలు అఖండ2 అనే కాదు – పెద్ద పెద్ద హీరోల చిత్రాలు విడుదల రోజు వరకూ పురిటి నొప్పులుపడుతున్నాయి. ఇక్కడ నిర్మాతలు చేస్తున్న తప్పులే ఎక్కువ. స్టార్ – డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే చాలు అమ్మేసుకుందాము అనుకొంటున్నారు తప్ప – వాస్తవంగా మార్కెట్ ఎలా ఉంది? ఆ హీరో రేంజ్ ఎంత? మనం పెట్టాల్సింది ఎంత? రాబడి మార్గాల్లో వచ్చేవాటి గురించి కాగితం మీద రాసుకున్న లెక్కలకీ వాస్తవ రాబడికీ పొంతన కుదురుతుందా? అనేది చూసుకోవడం నిర్మాతల కనీస బాధ్యత.

ఇవన్నీ వదిలేసి హీరోకి రూ.40 కోట్లు, అతని డేట్స్ ఇచ్చినందుకు వాళ్ళ వారసులు/వారసురాళ్లకు రూ.10 కోట్లు, డైరెక్టర్ కి ఓ రూ.30 కోట్లు, మోత మోగించి చెవుల తుప్పు వదిలించే మ్యూజిక్ డైరెక్టర్ కి రూ.6 కోట్లు, హీరోయిన్ కి ఓ రూ.2 కోట్లు.. ఇలా పారితోషికాలు, నజరానాలు ఇచ్చుకొంటూపోతే సినిమా పూర్తయ్యే సరికి బడ్జెట్ కి అంతూ దరీ ఉంటుందా? సినిమా పూర్తయ్యే సరికి కాగితం మీదనే నష్టాలు కనిపిస్తాయి కదా. టేబుల్ ప్రాఫిట్ మాట దేవుడెరుగు టేబుల్ లాస్ మూటగట్టుకోవలసిందే.

ఈ పరిస్థితులు రావడానికి నిర్మాత అనే వ్యక్తికి ఇప్పుడు ఇండస్ట్రీలో అజమాయిషీ లేదు. అంతా కాంబినేషన్ చుట్టూనే తిరుగుతుంది. స్టార్, డైరెక్టర్ ఒకటై నడిపిస్తున్నారు. మా పేరు మీద సినిమా అమ్ముకొనే నీకు జోక్యం లేదని తేల్చిపడేస్తున్నారు.

అఖండ 2 విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ ఇప్పుడు రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారానికి రంగంలోకి తమ పారితోషికాల్లో “కోత”కి ఒప్పుకున్నారు. ఇద్దరి పారితోషికాల్లో కలిపి 11 కోట్లు నిర్మాతలకు తిరిగి ఇస్తున్నారు.

ఇలాంటి సమస్య అఖండ 2కి మాత్రమే వచ్చింది. ఈ తరహా సమస్య తొలిసారి కాదు. చివరిసారి కాబోదు. గతంలో పలువురు పెద్ద హీరోల సినిమాలకు వచ్చిన సమస్యలే. అయితే వాటి నుంచి నిర్మాతలు మాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదు. ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడి పెట్టినవాళ్లు యజమానులుగా ఉంటారు. వాళ్ళ కనుసన్నల్లోనే అంతా నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో మాత్రం సీన్ రివర్స్. కోట్లు పెట్టిన వ్యక్తికి ఏ మాత్రం అదుపు ఆజ్ఞలు ఉండవు. ఆ యూనిట్ లో ఆయన ఓ కరివేపాకు మాత్రమే. ఈ పరిస్థితికి కారణం నిర్మాతలే.

By స్వప్న రాగలీన