నిర్మాతలని పక్కన పెట్టిన బాలయ్య

TeluguCinema 15 Dec 2025
Balayya

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన “అఖండ” సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. కానీ ఎందుకో అతను సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. బోయపాటి చెప్పిన బడ్జెట్, అడిగిన పారితోషికాలు సినిమా వర్కవుట్ కాదని ఆయన భావించి ఉంటారు. దాంతో, “అఖండ 2″ని నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ముందుకొచ్చారు.

కానీ బాలయ్య నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంటలకు ఈ సినిమా అప్పగించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తీసేందుకు వాళ్ళు అంగీకరించారు. అలాగే బాలయ్య డేట్స్ తన కూతురుకి ఇచ్చారు. దాంతో ఆమెని ఈ సినిమాలో సహ నిర్మాతలుగా మార్చారు. అలా తేజస్విని నందమూరి ప్రెజెంటర్ గా బాలయ్యకి 45 కోట్ల పారితోషికంతో, బోయపాటికి 35 కోట్ల పారితోషికంతో సినిమా మొదలయ్యింది.

గతంలో దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు, లెజెండ్ వంటి సినిమాలు తీసిన 14 రీల్స్ సంస్థ కొన్ని నష్టాలు చొసింది. మరో నిర్మాత అనిల్ సుంకరతో విడిపోయి విడిగా 14 రీల్స్ ప్లస్ పెట్టారు గోపి, రామ్. ఐతే పాత సినిమాల బకాయిలు వీరి మెడకు చుట్టుకున్నాయి. అలా తీరా విడుదల సమయానికి “అఖండ 2” ఆగిపోయింది. ఆగడు, ఇతర సినిమాల అప్పులను తీర్చాలని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కేసు వేసింది.

దాంతో, బాలయ్య, తన బంధువు డాక్టర్ సురేందర్, మ్యాంగో రామ్, దిల్ రాజు, రిలయన్స్ శ్రీధర్ లని రంగంలోకి దింపి ఈ సమస్యకి పరిష్కారం దక్కేలా చూశారు. నిర్మాతల కొన్ని బకాయిలను తీర్చి సినిమా స్మూత్ గా విడుదలయ్యేలా చేశారు వాళ్ళు. దాంతో “అఖండ 2” ఒక వారం ఆలస్యంగా విడుదలైంది.

ఐతే, ఈ సినిమా విడుదల విషయంలో సంక్షోభం సృష్టించిన నిర్మాతలు గోపి ఆచంట, రామ్ అచంటని బాలయ్య వెంటనే పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్ళని దగ్గరికి రానివ్వడం లేదంట. అందుకే, నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు కనిపించలేదు.

బాలయ్యకి ఇవ్వాల్సిన 45 కోట్ల పారితోషికంలో 6 కోట్లు కోత పడింది. అలాగే బోయపాటికి 5 కట్. వీరిద్దరూ కలిపి 11 కోట్లు వదులుకోవాల్సి వచ్చింది.