అవి నన్ను థ్రిల్ చెయ్యవు: దీపిక

TeluguCinema 18 Nov 2025
Deepika Padukone

ఇప్పుడు నన్ను పెద్ద సినిమాలు ఎక్సయిట్ చెయ్యవు అని చెప్తున్నారు దీపిక పదుకోన్. ఒకప్పుడు బాక్సాఫీస్ హిట్ ల కోసం పనిచేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు తన ప్రాధాన్యం మారిందని అంటున్నారు.

ఇటీవల దీపిక పదుకోన్ “కల్కి 2”, “స్పిరిట్” సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఐతే, ఆ సినిమాల నుంచి మేకర్స్ తప్పించినా దీపిక పదుకోన్ బాధపడడం లేదు.

Harper’s Bazaar పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. తనకు ఇప్పుడు ప్రేరణ ఇచ్చే విషయాలు మారిపోయాయి అని క్లారిటీ ఇచ్చారు. మునుపటిలా పెద్ద సినిమాల్లో నటించాలని కానీ, పెద్ద పెద్ద హిట్ చిత్రాల్లో భాగస్వామిని కావాలని ఆమె అనుకోవడం లేదు.

“ఇప్పుడు నేను ఉన్న దశలో వాటి గురించి ఆలోచించడం లేదు. 100 కోట్ల సినిమా గురించి కాదు, 500-రూ. 600 కోట్ల సినిమాల గురించి కూడా కాదు. ఇప్పుడు నా ప్రియారిటీస్ మారిపోయాయి,” అని ఆమె అన్నారు.

అందుకే “కల్కి 2”, “స్పిరిట్” లాంటి భారీ సినిమాలు తన నుంచి చేజారినా ఆమె ఇంచ్ కూడా ఫీల్ కావడం లేదు. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న “కింగ్”, అలాగే అల్లు అర్జున్ నటిస్తోన్న అట్లీ సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ రెండు సినిమాల మేకర్స్ ఆమెకి అనుకూలంగా షూటింగ్ లు పెట్టుకున్నారు. ఆమె రోజుకి ఎనిమిది గంటల కన్నా పని చెయ్యను అని తేల్చిచెప్పింది. ఎందుకంటే తన కూతురు సరంక్షణ చూసుకోవాలి. ఏడాది పాపకి తల్లిగా తాను చెయ్యాల్సిన పనులు, పోషణ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే తన మొదటి
ప్రాధాన్యం అంటోంది. అందుకే, తనకి తక్కువ పనిగంటలు కల్పించేందుకు ఒప్పుకున్న షారుక్, అల్లు అర్జున్ చిత్రాలను ఆమె అంగీకరించింది.