బాలయ్య చెయ్యడం లేదా?

నందమూరి బాలకృష్ణ ఏ సినిమా ఒప్పుకుంటారో? ఏ సినిమా వద్దనుకుంటారో చెప్పడం కష్టం. తనకు నచ్చిందే చేస్తారు. తాజాగా ఆయన రెండు సినిమాలు రిజెక్ట్ చేశారని టాక్. ఆ రెండూ కూడా అతిథి పాత్రలు లేదా ప్రత్యేక పాత్రలు.
రామ్ పోతినేని నటించిన “ఆంధ్రా కింగ్ తాలూకా” సినిమాలో బాలయ్యని కీలక పాత్ర కోసం అడిగారట. ఆ సినిమాలో కథ ప్రకారం ఒక పెద్ద హీరో కావాలి. అశేష అభిమాన గణం ఉన్న ఒక పెద్ద హీరో పాత్రలో నటించాలి అని ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదంట. దాంతో ఆ పాత్రని ఉపేంద్ర చేస్తున్నారు. బాలయ్య ఈ పాత్ర ఒప్పుకోకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
ఐతే, రజినీకాంత్ సినిమాని కూడా బాలయ్య తిరస్కరించారు అని తాజాగా ప్రచారం మొదలు అయింది.
పెళ్లి తర్వాత మూడు
ఇందులో నిజం ఎంతో తెలియదు. ఒకవేళ నిజంగానే బాలయ్య రజినీకాంత్ నటిస్తోన్న “జైలర్ 2” తిరస్కరిస్తే అది పెద్ద షాక్ అని చెప్పాలి. మొదటి భాగం “జైలర్”లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి పెద్ద హీరోలు అతిథి పాత్రల్లో కనిపించారు. ఆ సినిమా భారీ విజయంలో వారి పాత్ర కూడా ఉంది. ఆ పాత్రలకు కూడా మంచి హైప్ వచ్చింది. ఇక “జైలర్”లోనే బాలయ్యని పోలీస్ అధికారిగా నటింపచెయ్యాలని దర్శకుడు నెల్సన్ భావించారు. కానీ అప్పుడు కుదరలేదు.
ఇప్పుడు సీక్వెల్ లో బాలయ్య తప్పకుండా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. బాలయ్య కుటుంబానికి, రజినీకాంత్ కి మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కి రజినీకాంత్ పెద్ద అభిమాని. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మంచి స్నేహం ఉంది. గత ఎన్నికల సందర్భంగా రజినీకాంత్ టీడీపీకి సపోర్ట్ చేశారు.
వీటిని బట్టి చూస్తే రజినీకాంత్ సినిమాలో బాలయ్య చిన్నదో, పెద్దదో అతిథి పాత్ర ఉచితంగానే చెయ్యాలిసిందే. మరి బాలయ్య నిజంగానే “జైలర్ 2” తిరస్కరించారా? లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా?