చిన్మయి ‘తాళి’ వివాదం

ప్రముఖ గాయని చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ గా ఉంటారు. ఆమె తన ట్వీట్లతో, కామెంట్లతో వివాదం రేపుతుంటారు. ఐతే, ఈ సారి తన భర్త చేసిన కామెంట్ వల్ల ఆమె వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఇటీవల ఒక సినిమా డైరెక్ట్ చేశారు. “ది గర్ల్ ఫ్రెండ్” పేరుతో రష్మిక హీరోయిన్ గా ఆయన సినిమా తీశారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాళి గురించి మాట్లాడారు.
“చిన్మయి తాళి వేసుకోదు. నిజానికి ఆడవాళ్లకు పెళ్లి అయింది అనే చెప్పే గుర్తులు ఎందుకు ఉండాలి మగాళ్లకు లేనప్పుడు. అందుకే నేను చిన్మయిని తాళి వేసుకోవద్దనే చెప్పాను,” అనే అర్థం వచ్చేలా ఒక కామెంట్ చేశారు.
దాంతో, “తాళి” గురించి, హిందూ సంప్రదాయాల గురించి, రాహుల్, చిన్మయిల కాపురం గురించి సోషల్ మిడియాలో రచ్చ మొదలైంది. మొదట సాధారణ డిస్కషన్ గా మొదలై చివరికి చిన్మయి “ఫెమినిజం” గురించి, ఆమె పద్దతుల గురించి ట్రోలింగ్ గా మారింది. దాంతో, చిన్మయి తాజాగా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ కి ఆమె తనని ఆన్ లైన్ లో వేధిస్తున్న పోస్టుల గురించి చెప్పింది. సజ్జనార్ ఈ విషయాన్నీ పరిశీలిస్తాను అని హామీ ఇచ్చారు.