ఇద్దరికీ దిల్ రాజు న్యాయం

పంద్రాగస్టు వీకెండ్ ని టార్గెట్ చేసుకొని రెండు భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఒకరి ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ చిత్రం.. వార్ 2. మరోటి … సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం.. కూలీ. రెండూ ఒకేరోజు (ఆగస్టు 14) విడుదల కాబట్టి థియేటర్ల సర్దుబాటు సమస్యగా మారింది.
నిజానికి ఈ రెండూ డబ్బింగ్ చిత్రాలే. కానీ ఒక సినిమాలో తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్నారు. మరో సినిమాలో సీనియర్ తెలుగు హీరో నాగార్జున అక్కినేని విలన్ గా నటిస్తున్నారు. అలా తెలుగు కనెక్షన్ ఉంది.
ఎన్టీఆర్ కి ఉన్న స్టార్డం, ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి కారణంగా ఎక్కువ థియేటర్లు “వార్ 2″కి వెళ్తాయి. ఐతే రజినీకాంత్ కి తెలుగులో ఉన్న పాపులారిటీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్రాక్ రికార్డు కారణంగా “కూలీ 2″కి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. సో, దీనికి కూడా భారీగా థియేటర్లు కేటాయించాలి. ఆంధ్రా, సీడెడ్ లో థియేటర్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో అంతా సెట్ చేశారు దిల్ రాజు.
దిల్ రాజు ఈ రెండు సినిమాలకు సెమి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. కూలీ చిత్రాన్ని ఏషియన్ సునీల్, సురేష్ బాబు కలిసి రిలీజ్ చేస్తున్నారు. వారికి సైలెంట్ పార్ట్నర్ దిల్ రాజు. ఇక “వార్ 2” చిత్రాన్ని నిర్మాత నాగవంశీ విడుదల చేస్తున్నారు. నాగవంశీ సినిమాలన్నీ తెలంగాణాలో దిల్ రాజు విడుదల చేస్తారు. రెండింటికీ తమ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కావడంతో దిల్ రాజు 60 శాతం థియేటర్లు వార్ 2 కి, 40 శాతం థియేటర్లు కూలీకి సెట్ చేశారు.
మొదటి వీకెండ్ తర్వాత ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తే ఆ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇస్తారు. మొదటి వీకెండ్ మాత్రం అలా 60-40తో సర్దుబాటు చేశారు ఎలాంటి లొల్లి లేకుండా.