దుల్కర్ సల్మాన్ కారు సీజ్

TeluguCinema 23 Sep 2025
Dulquer Salmaan

రెవెన్యూ ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లగ్జరీ కార్లకు సంబంధించిన పన్ను ఎగవేతకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ నివాసాలపై సోదాలు నిర్వహించిన అధికారులు.. దుల్కర్ కు చెందిన లగ్జరీ వాహనాన్ని సీజ్ చేశారు.

తమిళనాడు నంబర్ ప్లేట్ కలిగిన దుల్కర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని, కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. 2012 మోడల్ అయిన ఈ వాహనం ముగ్గురు ఓనర్లు చేతులు మారింది. ప్రస్తుతం దుల్కర్ మూడో ఓనర్.

కేరళ అంతటా ఈ సోదాలు జరిగాయి. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని దాదాపు 30 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగాయి. నటుడు కమ్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై కూడా దాడులు జరిగాయి.

ఈ సోదాల వెనక ఓ ప్రత్యేక కారణం ఉంది. భూటాన్ ద్వారా లగ్జరీ కార్లను అనధికారికంగా దిగుమతి చేసుకొని, పన్ను ఎగవేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయి. ఈ వాహనాలను మొదట హిమాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ చేసి, తర్వాత ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్టు గుర్తించారు అధికారులు. మూలాలు బయటపడకుండా ఉండేందుకు తరచుగా రిజిస్ట్రేషన్ నంబర్లను మార్చినట్టు కూడా అధికారులు గుర్తించారు.