
కొన్ని లైన్స్ థ్రిల్లర్ జానర్ కు సరిగ్గా సరిపోతాయి. ఈరోజు రిలీజైన హిడింబ కూడా ఆ కోవకు చెందిందే. ఈ సినిమాను కథగా చెప్పుకుంటే భలేగా ఉందనిపిస్తుంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఇదేంటి ఇలా ఉంది అనిపిస్తుంది. “హిడింబ” సినిమా ఎలా ఉందో చెప్పడానికి ఈ మూడు లైన్లు చాలు.
ఓ మంచి థ్రిల్లర్ తీయడానికి కథ మాత్రమే ఉంటే సరిపోదు, ఆకట్టుకునే కథనం కూడా కావాలి. ఊహించని మలుపులుండాలి. ఇది “హిడింబ”లోపించింది. నరమాంస భక్షకుల గురించి ఈ సినిమాలో చర్చించారు. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఎలిమెంట్ తో ఓ థ్రిల్లర్ సినిమాను ఓ రేంజ్ లో తీయొచ్చు. కానీ దర్శకుడు అనీల్ కన్నెగంటి మంచి అవకాశాన్ని మిస్ చేశాడు. అతడు చేసిన తప్పులేంటో చూసే ముందు, అసలు హిడింబ కథ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
హైదరాబాద్లో బాలికల అదృశ్యం చుట్టూ హిడింబ కథ నడుస్తుంది. కేరళకు చెందిన ఆద్య (నందితా శ్వేత) అనే స్పెషల్ ఐపీఎస్ అధికారికి, ఈ కేసును అప్పగిస్తారు. కేసు ఇన్ఛార్జ్గా ఉన్న అభయ్ (అశ్విన్ బాబు)ను కలుస్తుంది ఆద్య. అతడి సహాయం కూడా కోరుతుంది. వాళ్లిద్దరికీ ఓ రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇక కేసుకు సంబంధించి వారు లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, హిడింబ వంశం గురించి తెలుసుకుంటారు. మనుషులను పీక్కు తినే తెగ ఇది. ఈ తెగకు, బాలికల మిస్సింగ్ తో సంబంధం ఉండొచ్చని హీరోహీరోయిన్ అనుమానిస్తారు. బ్రిటిష్ కాలంలోనే అదృశ్యమైన హిడింబ కుటుంబానికి ఈ కేసుతో సంబంధం ఏంటనేది సినిమా స్టోరీ.
జనాలకు తెలియని ఓ నరమాంస భక్షక జాతి, బ్రిటిష్ కాలం, అమ్మాయిల మిస్సింగ్.. కాన్సెప్ట్ అదిరిపోయింది. కానీ స్క్రీన్ ప్లే తేలిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత హిడింబ వంశం రాకతో, అంతా మారిపోతుంది. మకరంద్ దేశ్పాండే నేపథ్యం, హిడింబ గతం, వర్తమానం మధ్య ఉన్న లింక్ గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడిస్తారు. అద్భుతమైన సౌండ్ డిజైన్ కారణంగా ఈ విభాగాలు చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే, కథనంలో ఎత్తుపల్లాలు ఆసక్తిని తగ్గిస్తాయి. దీనికితోడు కొన్ని సన్నివేశాలు కళ్ళుమూసుకునేలా చేస్తాయి.
థ్రిల్లర్ సినిమాల్లో లాజిక్స్ వెదక్కూడదు. అలా అని బేసిక్ లాజిక్ ను కూడా వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది. హిడింబలో అదే జరిగింది. చాలా ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. అశ్విన్ బాబు తన పాత్రకు న్యాయం చేశాడు. ఫైట్స్ లో నిజంగానే కొట్టాడేమో అనే ఫీలింగ్ కలిగిస్తుంది అతడి ఫిజిక్. మరో కీలక పాత్ర పోషించిన నందిత శ్వేత, తన పాత్రకు న్యాయం చేసింది. స్పై సినిమాలో ఓవరాక్షన్ చేసిన మకరంద్ దేశ్ పాండే, హిడింబలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాకు అతడి పాత్రే హైలెట్.
సినిమా టెక్నికల్ గా బాగుంది. మరీ ముఖ్యంగా సౌండ్ డిజైన్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. టెక్నికల్ అంశాల విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.
ఓవరాల్ గా “హిడింబ” సినిమా కోసం అంతా కలిసి మంచి పాయింట్ అనుకున్నారు. కానీ ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు. లాజిక్స్ గాలికొదిలేశారు. వయొలెన్స్ మరీ ఎక్కువగా చూపించారు. మంచి ప్లాట్ ను వేస్ట్ చేశారు.
బాటమ్ లైన్: హిడిం’బాంబ్’
Rating: 2.5/5
By M Patnaik