కాంత రివ్యూ: సా..గిన ‘శాంత’

దుల్కర్ లాంటి నటుడికి రానా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి కాంత అనే సినిమా తీశారు/చేశారు. ట్రయిలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదో మర్డర్ మిస్టరీ కూడా దాగుంది. ఇలా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన కాంత ఎలా ఉందో చూద్దాం.
ఓ స్టేజ్ ఆర్టిస్టుగా ఉన్న టీకే మహదేవన్ (దుల్కర్)లో టాలెంట్ ను దర్శకుడు అయ్యా అలియాస్ కోదండరామన్ (సముద్ర ఖని) గుర్తిస్తాడు. అతడ్ని ఓ మంచి నటుడ్ని చేస్తాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో తిరుగులేని హీరో అవుతాడు మహదేవన్. ప్రేక్షకులతో నటచక్రవర్తి అనిపించుకుంటాడు. మహదేవన్ క్రేజ్ పెరుగుతున్నకొద్దీ అయ్యగారు చూడలేకపోతారు. తనకు నచ్చినట్టు మహదేవన్ ఉండడం లేదనే కోపంతో, ఓ తప్పుడు కేసులో అతడ్ని జైలుకు పంపిస్తాడు. ఆ తర్వాత తనే బెయిల్ పై బయటకు తీసుకొస్తాడు. ఈ విషయం తెలిసిన మహదేవన్, తన గురువుతో తెగతెంపులు చేసుకుంటాడు. అలా గురుశిష్యులు విడిపోతారు.
అయితే గురువు దగ్గరున్న ఓ కథ టీకే మహదేవన్ కు చాలా ఇష్టం. కానీ ఆ కథలో క్లైమాక్స్ అతడికి నచ్చదు. మొత్తానికి మోడ్రన్ స్టుడియోస్ వీళ్లిద్దర్నీ కలుపుతుంది. హీరోయిన్ గా కొత్తమ్మాయి కుమారి (బాగ్యశ్రీ)ని తీసుకుంటారు. కుమారిని కూడా అయ్యానే తీసుకొస్తాడు. అయితే ప్రాజెక్టును తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటాడు టీకే మహదేవన్. తనే డైరక్షన్ చేయడంతో పాటు క్లైమాక్స్ కూడా మార్చేస్తాడు. వీళ్లిద్దరి మధ్యలో కొత్తగా వచ్చిన కుమారి నలిగిపోతుంది. ఇద్దర్నీ కలిపే ప్రయత్నంలో హీరోకు దగ్గరౌతుంది. అంతలోనే పెద్ద మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎలా జరింగి.. ఎవరు చేశారు అనేది కథలో ట్విస్ట్. ఈ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో సినిమా ముగుస్తుంది.
మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్లు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కాకపోతే ప్రతిసారి కొత్త తరహాలో చెబితే బుద్ధిగా కూర్చొని హిట్ చేసేంత పెద్ద మనసు ఆడియన్స్ కు ఉంది. కాంత సినిమా కూడా ఆ జానర్ కథే. పైగా కొత్తగా చెప్పారు కూడా. కానీ ఎక్కడో ఏదో తేడా, ఇంకెంతో వెలితి.
సినిమాలో సినిమా ఇది. దుల్కర్ హీరో పాత్ర పోషించాడు. సముద్రఖని దర్శకుడి పాత్ర పోషించాడు. దుల్కర్ ను హీరోను చేశాననే గర్వం సముద్రఖనిది. ఇంకా ఎన్నాళ్లు ఆయన చెప్పినట్టే వినాలి, తనకంటూ ఓ సొంత ఇమేజ్, క్రేజ్ వచ్చింది కదా అనేది హీరోగారి పంతం.
నిజజీవితంలో హీరో-దర్శకుడి మధ్య ఇగోలు చాలా దూరం వెళ్తాయి. ఎంతదూరం అంటే, ఇక వాళ్ల కాంబినేషన్లో సినిమా రాదు. ఒకవేళ ఎవరైనా పెద్ద మనిషి కలుగజేసుకొని ఇద్దర్నీ ఒకే సెట్స్ పైకి తీసుకొచ్చినా రిజల్ట్ తేడా కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాంతాలో కూడా ఓ నిర్మాత అలానే హీరో-దర్శకుడ్ని కలుపుతాడు.
సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచే హీరో-దర్శకుడి మధ్య అహం పతాకస్థాయికి చేరుతుంది. ఒక దశలో దర్శకుడు లేకుండా తనే సినిమా తీస్తానంటాడు హీరో. క్లైమాక్స్ కూడా మార్చేస్తానంటాడు. దర్శకుడు ఒప్పుకోడు. వీళ్లిద్దరి మధ్య హీరోయిన్ నలిగిపోతుంది. అదే ఆమెకు తొలి సినిమా. అలా ప్రథమార్థమంతా సినిమా షూటింగులు, హీరో-దర్శకుడి మధ్య అహంభావాలతో నెట్టుకొట్టిన దర్శకుడు, ఓ మంచి మర్డర్ సీన్ తో ఇంటర్వెల్ కార్డు వేస్తాడు.
ఇక ద్వితీయార్థం అంతా ఈ మర్టర్ మిస్టరీని ఛేదించే ప్రక్రియ నడుస్తుంది. సరిగ్గా ఇక్కడే పోలీసాఫీసర్ గా రానా ఎంటర్ అవుతాడు. అప్పటివరకు దుల్కర్-సముద్రఖని నటనా పటిమను చూసిన ప్రేక్షకులకు, తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తాడు రానా. ఓవైపు వీళ్ల నటన, మరోవైపు కేసు విచారణ, చివర్లో 2-3 ట్విస్టులు.. ఓ నటచక్రవర్తి జీవితంలో జరిగిన మర్డర్ మిస్టరీగా కాంత నిలిచిపోతుంది.
సాధారణంగా సినిమా షూటింగ్ అంటేనే బోరింగ్ వ్యవహారం. కాంత సినిమాలో ఫస్టాఫ్ మొత్తం షూటింగ్ పెట్టి నీరసంగా బండి లాగించాడు దర్శకుడు. ఒక టైమ్ లో మనం సినిమా చూస్తున్నామా, స్టేజ్ పై నాటకం చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కెమెరా, లైటింగ్, మ్యూజిక్, డైలాగ్స్.. ఆ ఫీలింగ్ ను మరింత పెంచుతాయి. దీనికితోడు కన్ఫ్యూజన్ ఒకటి. ఒకానొక సందర్భంలో దర్శకుడు సినిమా కథ చెబుతున్నాడా లేక సినిమాలో చూపిస్తున్న మరో సినిమా కథ చెబుతున్నాడో అర్థం కాదు. నీరసం తెప్పిస్తూ సాగే స్క్రీన్ ప్లేకు, అక్కడక్కడ గందరగోళం కూడా తోడై, కాంతను అన్యాక్రాంతం చేశాయి.
సినిమాలో దర్శకుడు శాంత అనే కథ రాసుకుంటాడు. అది తన అమ్మ కథ అని చెబుతాడు. క్లైమాక్స్ లో హీరో చనిపోతాడని కూడా చెబుతాడు. అంతవరకు బాగానే ఉంది కానీ, తన అమ్మ కథలోకి హారర్ ఎలా వచ్చిందో చెప్పడు. అంత పెద్ద క్రైమ్ తన అమ్మ జీవితంలో జరిగిందని, తన ముందే అమ్మ చనిపోయిందని సినిమాలో దర్శకుడు తనకుతాను చెప్పుకోవడం, దాన్ని ఓ కళాత్మక చిత్రంగా తీస్తానని చెప్పడం అతకదు.
నిజానికి దర్శకుడి పాత్ర పోషించిన సముద్రఖని క్యారెక్టర్ లోనే చాలా అయోమయం ఉంది. ఒక దశలో హీరోను జైలుపాలు చేస్తాడు దర్శకుడు. అప్పటివరకు అన్నీతానై చూసుకున్న వ్యక్తిని జైలుకు పంపించడం, అది కూడా ఓ చిన్న కారణంతో అలా చేయడం కన్విన్సింగ్ గా అనిపించదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు హీరో పాత్ర చిత్రణలో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఇక్కడ చెబితే, కథలో ట్విస్ట్ బయటపెట్టినట్టవుతుంది కాబట్టి టచ్ చేయడం లేదు.
కళాత్మకంగా తీయాలనుకున్న ఈ మర్డర్ మిస్టరీలో బ్లాక్ అండ్ వైట్ తప్ప కళాత్మకత కనిపించదు. నటీనటుల పెర్ఫార్మెన్సులు తప్ప ఎమోషన్ కనిపించదు. అలా అని మర్డర్ మిస్టరీలో థ్రిల్ కూడా కనిపించదు. ఏమాటకామాట చెప్పుకోవాలి. దుల్కర్ నటన అద్భుతం. తనకు ఎంతో అలవాటైన వింటేజ్ లుక్ లోకి ఒదిగిపోయిన ఈ నటుడు, నటనతో అదరగొట్టాడు. పనిలోపనిగా ఈసారి తన డాన్సింగ్ టాలెంట్ కూడా చూపించాడు. సముద్రఖని పాత్ర కూడా దుల్కర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇక భాగ్యశ్రీ విషయానికొస్తే, ఆమె ఈ సినిమాలో సర్ ప్రైజ్ ప్యాకేజీ. ఊహించని పెర్ఫార్మెన్స్ ఇచ్చింది భాగ్యశ్రీ. సీతారామంలో మృణాల్ లా ఆమె పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక సెకండాఫ్ నుంచి వచ్చే రానా, చాలా ఈజీగా అలా నటించుకుంటూ వెళ్లిపోయాడు. చాలాచోట్ల అతడి నటన కంటే డైలాగ్ డెలివరీ, మాడ్యులేషనే మనకు ఎక్కువ నచ్చుతుంది.
అయితే నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు ఉంటే సరిపోతుందా? ఇదొక్కటి సినిమాను నిలబెడుతుందా? కానే కాదు. ఈ విషయంలో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దే తప్పు. మంచి నటుల్ని తీసుకున్న ఈ డైరక్టర్, స్క్రీన్ ప్లేను కూడా దానికి తగ్గట్టు మరింత క్రిస్పీగా రాసుకుంటే బాగుండేది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చిన కీలకమైన ట్విస్ట్ నమ్మేలా ఉండదు.
కథ ప్రకారం పాత సినిమా సెట్టింగులు, పాత డైలాగులు, పాత వస్తువులు వాడిన ఈ దర్శకుడు.. స్క్రీన్ ప్లే విషయంలో కూడా అదే పాత పద్ధతిని ఫాలో అయ్యాడు. నటీనటుల నుంచే కాకుండా, టెక్నికల్ గా కూడా మంచి ఔట్ పుట్ రాబట్టుకున్న దర్శకుడు, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త పట్టు చూపించి ఉంటే బాగుండేది. ప్రధాన పాత్రల పెర్ఫార్మెన్సులు బాగున్నప్పటికీ.. టెక్నికల్ గా ఆకట్టుకున్నప్పటికీ, 163 నిమిషాల పాటు ఈ సినిమాను చూడాలంటే ఓపిక కావాలి.
బాటమ్ లైన్: కళాత్మకంగా సా..గిన కాంత