
కంగన రనౌత్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ. హిమాచల్ ప్రదేశ్ లోని తన సొంత ప్రాంతం మండీ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఐతే, ఆమె రాజకీయవేత్తగా మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంపీ కాకముందు ఫైర్ బ్రాండ్ గా ఉండేది. అందరిపై గయ్యిమని అరిచేది. ఆరోపణలు గుప్పించేది. కానీ ఇప్పుడు జనం సమస్యలతో తన ముందుకు వస్తుంటే కంగారు మొదలవుతోంది ఆమెలో.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. జన జీవనం స్తంభించింది. చిరు వ్యాపారాలు తమ దుకాణాలు కోల్పోయారు. అనేక మంది ఇళ్లు కూలిపోయాయి. దాంతో వరద బాధితులు ఆమెని సాయం చేయమని అడిగితే రివర్స్ లో కంగనా సమాధానం ఇచ్చింది.
తన రెస్టారెంట్ వ్యాపారం కూడా దెబ్బతింది అని ఆమె పేర్కొంది. మనాలిలో ఆమె ఇటీవల ఒక పెద్ద రెస్టారెంట్ ప్రారంభించి దాన్ని నడుపుతోంది.
“మీరే కాదు నేను కూడా నష్టపోయాను. నా రెస్టారెంట్ లో మొన్న కేవలం 50 రూపాయల బిజినెస్ అయింది. నేను రెస్టారెంట్ సిబ్బందికి నెలకు 15 లక్షలు ఖర్చు పెడుతున్నాను. కానీ నాకు జరిగిన వ్యాపారం 50 రూపాయలు. మరీ నేను కూడా బాగా నష్టపోయాను కదా మీలాగే. వరదల వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింది అని మీరు తెలుసుకోవాలి. నేను కూడా ఒక ఒంటరి మహిళను. నాకు కూడా కష్టమే కదా,” అని వరద బాధితులకు తన గోడు చెప్పుకొంది.
ఆమె రెస్టారెంట్లో కేవలం 50 రూపాయల బిల్లు జరిగింది అంటే ఎవరో వచ్చి కేవలం ఒక చాయ్ లేదా ఒక వాటర్ బాటిల్ మాత్రమే తీసుకొని ఉంటారు అని ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే అంత తక్కువ మొత్తానికి ఆమె ప్రీమియం రెస్టారెంట్ లో ఛాయ్ ఖరీదు 50 రూపాయలు. అంత కన్నా తక్కువ ధరలో మరో ఐటెం లేదు మరి.





