‘కాంతార చాప్టర్ 1’కి 110 కోట్లు

“కాంతార చాప్టర్ 1” థియేటర్లలో బాగా ఆడింది. కర్ణాటకలో ఇంకా ఆడుతోంది. కానీ ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ విడియోలోకి వచ్చింది. ఈ రోజు (అక్టోబర్ 31) నుంచి తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
ఈ సినిమా థియేటర్లలో ఎంత వసూళ్లు సాధించినా నిర్మాతకు అసలైన లాభం ఓటిటి రైట్స్ ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం డైరెక్ట్ గా నిర్మాత అకౌంట్ లో పడుతుంది. అందుకే నిర్మాతలు విడుదలకు ముందే ఓటిటి అమ్మకాల కోసం కష్టపడుతుంటారు. ఈ సినిమాకి రిలీజ్ కు ముందే చాలా హైప్ ఉంది. అందుకే నిర్మాతలు 125 కోట్లకు బేరం పెట్టారు.
నెట్ ఫ్లిక్స్ సంస్థ 100 కోట్లకు మించి ఇవ్వలేమని తేల్చింది. ఐతే అమెజాన్ ప్రైమ్ రంగంలోకి దిగి పది కోట్లు కలిపి 110 కోట్లు ఆఫర్ చేసింది. దాంతో నిర్మాత వెంటనే ఓకే చేశారు. అలా ప్రైమ్ వీడియో నుంచి నిర్మాతకు 110 కోట్లు వచ్చాయి. కన్నడ సినిమాకి ఇది రికార్డు మొత్తం.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, యాక్ట్ చేసిన ఈ చిత్రం మిశ్రమ రివ్యూస్ పొందింది. ఐతే థియేటర్లలో మాత్రం బాగా ఆడింది. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఎక్కువ వసూళ్లు అందుకొంది. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రుక్మిణి వసంత్ కి ఒక్కసారిగా దేశమంతా క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది.