స్టయిలింగ్ మార్చాల్సిందే!

TeluguCinema 04 Oct 2025
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాగా ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలైన “మీసాల పిల్ల” అనే పాట ప్రోమో విడుదలైన తర్వాత ఆయన లుక్స్, స్టయిలింగ్ మీద ఎక్కువ కామెంట్స్ పడుతున్నాయి.

ఈ పాటలో చిరంజీవి లుక్ బాలేదని కాదు. మరీ యంగ్ గా కనిపిస్తున్నారు. సూట్ వేసుకొని, హీరోయిన్ నయనతారని ఆటపట్టించే ఈ పాటలో చిరంజీవి మరీ యువకుడి తరహా స్టయిలింగ్ చేసుకోవడం విమర్శలకు కారణం. ఆయన వయసుకు తగ్గట్లు కాస్త గ్లామర్ గా కనిపిస్తే చాలు. మరీ పాతికేళ్ల కుర్రాడిలా ఆ డ్రెస్సింగ్, ఆ స్టయిలింగ్ ఏంటి అని తెగ ట్రోలింగ్ అవుతోంది.

నిజమే. చిరంజీవి స్టయిల్ విషయంలో తన పంథాని మార్చుకోవాలి. ఈ పాటలో ప్రొడక్షన్ క్వాలిటీ బాగాలేదు, విజువల్స్ బాలేవు వంటి విమర్శల్లో అర్థం లేదు. కానీ చిరంజీవి తన పాత్రకు తగ్గట్లు కుర్రాడిలా కనిపించాలనే ప్రయత్నంలో మరీ ఓవర్ గా ట్రెండీ స్టయిలింగ్ కి వెళ్లడం బాలేదు. అందుకే ఇంత ట్రోలింగ్.

చిరంజీవి సినిమా మొత్తంగా చూస్తే రకరకాలుగా కనిపిస్తారు. చాలా చోట్లా తన వయసు కనిపిస్తుంది. కానీ పాటల విషయానికి వచ్చేసరికి “క్రింజ్” అనిపించేలా ఉంటుంది స్టయిల్. ఇప్పటికైనా మెగాస్టార్ తన హుందాతనం ఉట్టిపడేలా డ్రెస్సులు తీసుకురావాలని తన స్టయిలిస్ట్ లకు చెప్పాలి.