విజయ్ కాదు, వ్యాపారవేత్త కాదు!

ప్రభాస్ లాగే త్రిషకి పెళ్లి అనేది ఒక సమస్య అయింది. ఎప్పుడూ ఎవరో ఒకరితో పెళ్లి అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పుకార్లు రావడం ఆమెకి తలనొప్పిని తెస్తోంది. తాజాగా ఆమె ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోబోతోంది అని ప్రచారం మొదలైంది. చండీగఢ్ కి చెందిన ఈ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి అంటూ పేరొందిన పత్రికలు రాశాయి.
దాంతో, ఆమె ఘాటుగా స్పందించింది. పెళ్లి డేట్ తో ఎందుకు ఆగారు, హనీమూన్ కి కూడా ముహూర్తం పెట్టేస్తే బాగుండేది కదా అని ఆమె సోషల్ మీడియాలో ఈ పుకార్లు లేపిన వాళ్లకు చురకలు అంటించింది.
దాదాపు పదేళ్ల క్రితం వరుణ్ మన్యన్ అని చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఆమె నిశితార్థం జరిగింది. కానీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసే టైంకి ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. నిశితార్థంతోనే వారి బంధం ముగిసింది. ఆ తర్వాత త్రిష హీరో శింబుతో ప్రేమలో పడింది అని పుకార్లు వచ్చాయి.
ఇటీవల తమిళ అగ్ర హీరో, రాజకీయనాయకుడు విజయ్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది అని ప్రచారం మోడలింది. త్రిష, విజయ్ ఇటీవల వరుసగా మూడు సినిమాల్లో కలిసి నటించడం ఈ పుకార్లు బలం తెచ్చింది. అలాగే విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చాడని, త్రిషని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఒక తమిళనాడు రాజకీయ నాయకుడు ప్రకటించాడు. ఐతే, అదంతా విజయ్ రాజకీయ ప్రత్యర్థులు రేపిన పుకారు అని ఆ తర్వాత తేలింది.
ALSO READ: Trisha posts sarcastic reply to wedding reports
ఇప్పుడు చండీగఢ్ వ్యాపారవేత్తతో పెళ్లి అనేసరికి ఆమెకి చిర్రెత్తుకువచ్చింది. విజయ్ తో పుకార్లు వచ్చినప్పుడు సైలెంట్ గానే ఉంది.

ఈ 42 ఏళ్ల భామ ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.