ధీమా ఎక్కువై… ట్రోలింగ్ కి గురై

“వార్ 2” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేశాడు… బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కూడా కలర్ ఎగిరేయించాడు ఎన్టీఆర్. కానీ తీరా సినిమా విడుదలై పరాజయం పాలు అయింది. దాంతో ఎన్టీఆర్ తెగ ట్రోలింగ్ కి గురి అయ్యాడు. సినిమా మీద ధీమా ఉండడం వేరు, కాలర్ ఎగిరెయ్యడం వేరు. అతిగా రియాక్ట్ అయి ఎన్టీఆర్ విమర్శలకు చిక్కాడు.
అదే సినిమా ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ కూడా అతి చేశారు. ఆ సినిమా హిందీ కంటే తెలుగులో ఎక్కువ చెయ్యాలని, ఫ్యాన్స్ ని తెగ రెచ్చగొట్టాడు. సినిమా మామూలుగా ఉండదు అని బిల్డప్ ఇచ్చారు. ఆ సినిమాకి ఆయన నిర్మాత కాదు, కేవలం డిస్ట్రిబ్యూటర్. కానీ సినిమా ఈవెంట్ లో మాత్రం అసలు కలెక్షన్ల పరంగా బ్రహ్మాండం బద్దలు అవుతుంది అన్నట్లుగా హంగామా చేశారు.
దాంతో “చింటూ” (ట్రోలర్స్ నాగవంశీకి పెట్టిన పేరు) దుబాయ్ పారిపోయాడు అని సోషల్ మీడియా ట్రోల్ చేసింది.
తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా అదే చేశారు. “మాస్ జాతర” సినిమా ప్రీ – రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ ఒక ఛాలెంజ్ విసిరారు. “ఈ సినిమా చూసి జనం షాక్ అవకపోతే నేను ఇండస్ట్రీ వదిలిపోతా” అని రాజేంద్రప్రసాద్ ధీమాగా చెప్పారు. తీరా చూస్తే సినిమాలో ఆయన చెప్పిన ట్విస్ట్ షాక్ ఇవ్వలేదు, సినిమా కూడా ఆడడం లేదు. అందుకే ఇప్పుడు ఆయన్ని జనం ఎప్పుడు ఇండస్ట్రీ వదిలి వెళ్తున్నారు అని ఆటపట్టిస్తున్నారు.
ఆ మధ్య సిద్ధూ జొన్నలగడ్డ, అంతకుముందు విశ్వక్ సేన్ కూడా ఇలాగే తమ సినిమాల విషయంలో అతి చేసి మాట్లాడారు. సిద్ధూ “జాక్” విషయంలో అలా చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన “తెలుసు కదా” ఢమాల్. ఇక విశ్వక్ సేన్ …”లైలా” సినిమా విషయంలో అతి చేశాడు. అది ఘోర పరాజయం చూసింది. దాంతో విశ్వక్ సేన్ సైలెంట్ అయ్యాడు.