కళ మనుషులని కలపాలి: పవన్ కళ్యాణ్

TeluguCinema Team 29 Sep 2025
Kantara Chapter 1 and Pawan Kalyan

కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది… అంతేగానీ భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని కనబరిచారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అందుకే రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంతారా ఛాప్టర్ – 1’ టికెట్ ధరల పెంపునకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.

తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టికెట్ ధరలు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు వచ్చాయి. అక్కడి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు… పెద్ద మనసుతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ, హోమ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు నిర్ణయం జరిగింది.

ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదల సందర్భంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని, మన చిత్రాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంలేదని పేర్కొన్నారు. అదే విధంగా తెలుగు సినిమా ఉద్దేశంతో సినిమా పోస్టర్లు, బ్యానర్లు కూడా తొలగించే చర్యలకు కొందరు దిగుతున్నా కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

పవన్ కళ్యాణ్ భావన ఇది

ఈ విషయం గురించి పవన్ కల్యాణ్ తో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. ఈ అంశంపై శ్రీ పవన్ కల్యాణ్ స్పందిస్తూ “కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి… విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాము. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు” అన్నారు పవన్ కళ్యాణ్

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News