గ్యాప్ లేకుండా ప్లాన్

74 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా జోరు చూపిస్తున్నారు రజనీకాంత్. స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్న టైమ్ లో రజనీకాంత్, ఠంచనుగా ఏడాదికో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ఆయన కొత్త సినిమాలు ఎనౌన్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ‘కూలీ’ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన రజనీకాంత్, ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శశికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమాలో నటించారు శశికుమార్.
ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. ‘సుబ్రమణ్యపురం’ అనే సూపర్ హిట్ తమిళ సినిమా తెరకెక్కించి ఈయనే. ఇప్పుడీ దర్శకుడు రజనీకాంత్ కోసం ఓ కథ రాసుకున్నారట.
ఈ ప్రాజెక్టుకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమాతో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్. ఆ సినిమా కొలిక్కి వచ్చిన వెంటనే శశి కుమార్ సినిమాపై ప్రకటన ఉంటుంది. ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్.