లేడి వాంపైర్ గా రష్మిక

TeluguCinema 27 Sep 2025
Rashmika in Thamma

రష్మిక మందానకి హిందీలో విభిన్నమైన పాత్రలు దక్కుతున్నాయి. “చావా”లో మహారాణి పాత్ర లభించింది. ఇప్పుడు “తమ్మ” చిత్రంలో తడక అనే వాంపైర్ పాత్ర పోషిస్తోంది. వాంపైర్ అంటే రక్త పిశాచి.

హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా ఇందులో వాంపైర్ గా నటిస్తున్నాడు. అతను ఈ రక్తపిశాచితో ప్రేమలో పడుతాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. రష్మిక వాంపైర్ గా కనిపించడం ఈ ట్రైలర్ లో హైలెట్ అని చెప్పాలి.

సాధారణంగా పెద్ద హీరోయిన్లు దెయ్యాలుగా, రక్త పిశాచులుగా నటించేందుకు వెనుకాడుతారు. కానీ రష్మిక మందాన ఎలాంటి సంకోచం లేకుండా ఈ పాత్ర ఒప్పుకొంది.

రష్మిక మందానకి బాలీవుడ్ లో హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే క్రేజ్ కూడా బాగా ఉంది. అందుకే, ఆ క్రేజ్ ని నిలుపుకునేందుకు రకరకాల పాత్రలు, అన్ని రకాల జానర్ చిత్రాలు చేస్తోంది. త్వరలో “కాక్ టైల్ 2” చిత్రంలో పక్కా రొమాంటిక్ హీరోయిన్ గానూ కనిపించనుంది.

మరోవైపు, ఆమె నటించిన మరో తెలుగు చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” ఇంకా విడుదలకి నోచుకోవడం లేదు. ఈ సినిమా విడుదల ఇదిగో అదిగో అంటూ ఆరేడు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.