రిషబ్ శెట్టికి లాభాల పంట

“కాంతార చాప్టర్ 1” సినిమా మొదటి వీకెండ్ లోనే 300 కోట్ల రూపాయల (గ్రాస్) వసూళ్లు అందుకొంది. ఇది భారీ మొత్తం. ఈ సినిమా త్వరలోనే 500 కోట్ల మార్క్ ని దాటేలా ఉంది. రిషబ్ శెట్టి ఈ సినిమాకి దర్శకుడు, హీరో. ఐతే, దర్శకుడిగా, హీరోగా అతనికి పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ హోంబేలె ఫిలిమ్స్ ముందే అంగీకరించింది.
ఒకవేళ ఈ సినిమా 1000 కోట్ల మార్క్ అందుకుంటే మాత్రం రిషబ్ శెట్టికి 100కోట్లకు పైగా వాటా దక్కుతుంది. అందుకే, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఐతే ఈ దర్శకుడికి అంత పంట పండినట్లు.
రిషబ్ శెట్టి తీసిన “కాంతార” మొదటి భాగం కూడా మంచి విజయం సాధించింది. ఆ విజయం వల్లే నిర్మాణ సంస్థ ఈ ప్రీక్వెల్ ని భారీగా ఖర్చు పెట్టి తీసింది. అలాగే లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఒప్పుకొంది.
రిషబ్ శెట్టి తెలుగులో తాజాగా రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఒకటి “జై హనుమాన్” కాగా మరోటి సితార సంస్థ కొత్త చిత్రం. ఈ రెండు సినిమాలకు భారీగానే పారితోషికం తీసుకున్నాడు రిషబ్. మరి ఇప్పుడు వీటిలో కూడా లాభాల్లో వాటా అడుగుతాడా?
మరోవైపు, “కాంతార చాప్టర్ 2” కూడా ఉంటుంది అని ప్రకటించాడు.