చుండూరు నేపథ్యంగా RT4GM

రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అందులో ‘క్రాక్’ అతిపెద్ద హిట్. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతానికి “#RT4GM” అని పిలుస్తున్నారు. ఈ సినిమాని తాజాగా ప్రకటించారు.
“క్రాక్” సినిమా చీరాల (ప్రస్తుతం బాపట్ల జిల్లా) నేపథ్యంగా సాగింది. ఈ కొత్త చిత్రం చుండూరు ఊచకోత నేపథ్యంగా సాగుతుందా అనిపిస్తోంది. ఎందుకంటే… ఈ సినిమాని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో తగలబడుతున్న ఒక ఊరు, “చుండూరు” అని ఉన్న బోర్డు, డేంజర్ అనే మరో సైన్ బోర్డు ఉన్నాయి.
గుంటూరు జిల్లా చుండూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది 1991లో జరిగిన దళితుల ఊచకోత. రవితేజ హీరోగా నిజంగా అలాంటి అంశాన్ని తీసుకొని సినిమా తీసే ధైర్యం గోపీచంద్ మలినేని చేస్తాడా? లేక రెగ్యులర్ మాస్ సినిమాకి చుండూరు గ్రామ నేపథ్యం వాడుతున్నారా అనేది చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.